Saturday, November 23, 2024

తెలంగాణ బ‌డ్జెట్ లో కొత్త ప‌థ‌కాలు….

హైదరాబాద్‌, : ఈ దఫా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో కొత్త పథకాలకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గ అభివృద్ది నిధి పెంపు, ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు, ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు, మహిళలకు చేయూతను ఇచ్చే పథకాలు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ది నిధిని రూ.3కోట్ల నుండి 5కోట్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కరోనా కారణంగా నియోజకవర్గ అభివృద్ది నిధిని కేటాయించకపోగా, తమ చేతిలో చిన్నచిన్న పనుల నిధుల కేటాయింపుకు నిధులులేవని ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్‌ గత లోటు తీర్చేలా.. నియోజకవర్గ అభివృద్ది నిధి పెంపుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక ప్రతి నియోజకవర్గంలో స్వంత స్థలంలో ఇంటి పథకానికి సంబంధించి కూడా.. నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రతి నియోజకవర్గానికి వేయి ఇండ్లు ఇస్తే ఎంత బడ్జెట్‌ అవుతుంది.. రెండువేల ఇండ్లు కేటాయిస్తే ఎంత బడ్జెట్‌ అవుతుంది అన్నదానిపై ఇప్పటికే ఆర్ధికశాఖ వర్గాలు లెక్కలు పూర్తిచేసినట్లు తెలిసింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పూర్తికి కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటికి తోడు.. ఎస్సీ, ఎస్టీలకు రూ.50వేల నుండి లక్ష వరకు వ్యయమయ్యే స్వయం ఉపాధి యూనిట్లను పెద్ద ఎత్తున కేటాయించి, ఆర్ధికాభివృద్దికి.. ఉపాధికి బాటలు పరచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
వరాల వానే..
ఈ దఫా బడ్జెట్‌లొ వరాల వాన ఉండబోతున్నదని ఎమ్మెల్యేలు సంతోషంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే దీనిపై సంకేతాలిచ్చారని అంటున్నారు. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయింపుకు సంబంధించిన అధికారం కూడా ఇవ్వబోతున్నారని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపులోనూ ప్రాధాన్యత లభించబోతున్నదని ఆశిస్తున్నారు. అయితే కొత్త పథకాలు, మార్గదర్శకాలు, ఇప్పటికే ఉన్న పథకాలకు సంబంధించిన వెసులుబాట్లు అన్నీ మార్చి నెలాఖరులోనే తెలియనున్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తును ఆర్ధిక శాఖ వర్గాలు ఇప్పటికే ప్రారంభించాయి. నిధుల సమీకరణ, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్‌ సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని.. పథకాల కార్యాచరణ, నిధుల కేటాయింపు ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement