ఆంధ్రపభ స్మార్ట్ – హైదరాబాద్ – సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థుల్లో అర్హులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రగతి భవన్ లో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణకు చెందిన 2023 సివిల్స్ విజేతలు, 2024లో మెయిన్స్ రాసే అభ్యర్థులను ఉద్దేశించి .రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిందని.. ఎందరో యువత త్యాగాల పునాదులపై సొంత రాష్ట్రం కల సాకారమైందన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు.
అలాగే తెలంగాణ యువతలో ప్రతిభకు కొరవ లేదని.. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ తెలంగాణ సత్తాను చాటాలన్నారు. ముఖ్యంగా సివిల్స్ లోనూ ఎక్కువ మంది విజయం సాధించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ సహకారంతో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష లో విజయం సాధించిన వారు మెయిన్స్ కోచింగ్ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం, హాస్టల్ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి సివిల్స్ లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2023లో సివిల్స్లో విజేతలుగా నిలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. సివిల్స్ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం అభ్యర్థులకు వ్యయప్రయాసలతో కూడిన అంశమన్నారు. అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటును అందించడం ద్వారా వారి ఇబ్బందులను కొంత దూరం చేయాలన్న మంచి లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సింగరేణి తరఫున దీన్ని చేపట్టడం అభినందించదగిన విషయమన్నారు. అదే సమయంలో ఈ ఏడాది సివిల్స్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన 40 మంది అభ్యర్థులు, ప్రస్తుతం సివిల్స్కు సన్నద్ధం అవుతున్న వారు కూడా కార్యక్రమంలో పాల్గొనడం మంచి పరిణామమన్నారు. తెలంగాణలో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందనడానికి ఈ రోజు ప్రారంభించిన కార్యక్రమమే గొప్ప నిదర్శనమన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ.. తాను సివిల్స్ లో చేరిన తొలినాళ్లలో ముఖ్యమంత్రిని కలవడానికి రెండేళ్ల సమయం పట్టిందని గుర్తుచేసుకున్నారు. నేడు సివిల్స్ లో విజేతలుగా నిలిచిన తెలంగాణ బిడ్డలను అభినందించేందుకు.. అలాగే సివిల్స్ రాస్తున్న యువతకు ఆర్థిక చేయూత ఇచ్చి ఆశీర్వదించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులంతా రావడం గొప్ప విషయమన్నారు. సివిల్స్ విజేతలు తమ నడవడిక తో పేదలకు ఎప్పుడూ సేవకులుగా ఉండాలని కోరారు.
కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ స్వాగతోపన్యాసం చేస్తూ.. తాను సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సమయంలో కోచింగ్ కోసం 2 వేలు లభించక ఇబ్బంది పడ్డానని.. అలాగే రూ.50 విలువ చేసే పుస్తకం కొనుగోలుకు వారం రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసి తెలంగాణ నుంచి వీలైనంత ఎక్కువ మందిని సివిల్స్లో విజయం సాధించేలా ప్రోత్సహించే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో సింగరేణి తరఫున భాగస్వామిగా ఉండటం ఆనందకరమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవతో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
2023 లో తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ కు ఎంపికైన 35 అభ్యర్థులను, ఐఎఫ్ఎస్ కు ఎంపికైన ఆరుగురిని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి , ఇతర మంత్రులు ఘనంగా సన్మానించారు. ఈ యువకులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ నుండి మరింత మంది సివిల్స్ కు ప్రయత్నించాలని అటువంటి వారికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ద్వారా చిరు చేయూత లభిస్తుందన్నారు బలరాం.
ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా చాలా మంది సివిల్స్ ఆశావహుల్లో కొంత ఆర్థిక భరోసా నిస్తుందని, తమ సివిల్స్ లక్ష్యంపై దృష్టిసారించేందుకు దోహదపడుతుందన్నారు. ఇంత మంచి పథకానికి రూపకల్పన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీ హర్కర వేణు గోపాల్ రావు, ఎంపీలు రామసహాయం రఘురామ్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కోరెం కనకయ్య, వివేక్ వెంకటస్వామి, పాయం వెంకటేశ్వర్లు, కె ప్రేమ సాగర్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మట్టా రాగమయి, కనీస వేతనాల కమిషన్ ఛైర్మన్ జనక్ ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సీఎంవో సెక్రటరీ మాణిక్ రాజ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పథకం విశేషాలు..
ప్రతీ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు అంచనా.
వీరిలో ప్రాథమిక పరీక్ష లో దాదాపు 250 నుంచి 300 మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ లో అర్హులదరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్షలు పాసైన అభ్యర్థులు ఆర్థిక ప్రోత్సాహకం కోసం సింగరేణి సంస్థ వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.