పరిగి – బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మీ పేరుతో రాష్ట్రంలోని ప్రతిఆడబిడ్డకు నెలకు రూ. 3 వేలు ఇస్తామని, ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఇంకో ఏడాదిలోనే పరిగికి కృష్ణా నది నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ సోమవారం పరిగిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ.. తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కరెంట్, నీళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలోనే కరెంట్, నీళ్లు ఇచ్చిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం తీసుకొచ్చిన రైతు బంధు స్కీమ్ ద్వారా ఇప్పటికే 75 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు అందించామని తెలిపారు.ఇక తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికి రూ. 5 లక్షల బీమా ఇచ్చేలా డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకం తీసుకువస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆరు నెలలకు ఒక సీఎం మారడం గ్యారెంటీ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.