Wednesday, January 8, 2025

New Railway Station – తెలంగాణ ప్ర‌గ‌తిలో చ‌ర్ల‌ప‌ల్లి కీల‌కం – ప్రధాని మోడీ…

టూరిజంతో ఆర్థిక వృద్ది
హైస్పీడ్‌ రైళ్ల కోసం డిమాండ్‌ పెరుగుతోంది
సోలార్ స్టేష‌న్‌గా చ‌ర్ల‌ప‌ల్లికి ప్ర‌త్యేక‌త‌
వ‌ర్చువ‌ల్‌గా చ‌ర్ల‌ప‌ల్లి టెర్మిన‌ల్ ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ
ప‌దేళ్ల‌లో 30 వేల కిలో మీట‌ర్ల కొత్త‌లైన్లు ఏర్పాటు
శ‌ర‌వేగంగా మెట్రో విస్త‌ర‌ణ‌.. వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయి దాటేశాం
హైద‌రాబాద్‌లో మెట్రోకు సహకరించాల‌ని సీఎం రేవంత్
రైల్వేలో సంస్కరణలు తీసుకొచ్చాం : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి
వేల కోట్లు ఖ‌ర్చుతో రైల్వే అభివృద్ధి: కేంద్ర మంత్రి సోమన్న‌
ప్రణాళికాబ‌ద్ధంగా మూడు రంగాల అభివృద్ధి : కేంద్ర మంత్రి బండి
రైల్వే నెట్వర్క్ పెంచేలా సహకరించాలి: మంత్రి శ్రీధర్ బాబు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :
దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోంద‌ని, టూరిజంతో ప‌లు రాష్ట్రాల‌కు ఆర్థిక వృద్ధి చేకూరుతుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. సోమ‌వారం చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌గ‌తిలో చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ కీల‌కంగా మార‌బోతోంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఆధునాతన, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వందల కోట్ల రూపాయలతో నిర్మించిన‌ట్టు చెప్పారు. ఈ రైల్వే టెర్మినల్‌ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ₹413 కోట్ల‌తో నిర్మించిన‌ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను రైల్వే శాఖ నిర్మించింద‌న్నారు. ఔట‌ర్ రింగ్ రోడ్డుకు స‌మీపంలో ఉన్న ఈ రైల్వే స్టేష‌న్ తెలంగాణ అభివృద్ధిలో కీల‌కంగా మార‌బోతోంద‌న్నారు. సోల‌ర్ స్టేష‌న్​గా చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ను అభివృద్ధి చేశామ‌న్నారు.

- Advertisement -

రైల్వేకు బెంచ్ మార్క్‌..
రైల్వేకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామ‌ని ప్రధాని మోదీ అన్నారు. మారుమూల గ్రామాల‌కు రైల్వే క‌నెక్టివిటీ కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. కోట్లాది మంది ప్ర‌యాణికుల‌ను గ‌మ్య స్థానానికి చేర్చుతున్నామ‌ని చెప్పారు. రైల్వే ప్ర‌యాణికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. రైల్వే స్టేష‌న్లలో మౌలిక స‌దుపాయ‌ల‌పై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇప్ప‌టికే 180 కిలో మీట‌ర్ల వేగంగా ప‌రుగులు తీస్తున్న వందే భార‌థ్​ ట్రైన్‌లో స్లీప‌ర్లు కూడా పెడుతున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ట్ర‌య‌ల్ కూడా వేశామ‌న్నారు.

ప‌దేళ్ల‌లో 30 వేల కిలోమీట‌ర్ల కొత్త లైన్‌..
ప‌దేళ్ల‌లో 30 వేల కిలోమీట‌ర్ల కొత్త లైన్ల‌ను ఏర్పాటు చేశామ‌ని ప్ర‌ధాని చెప్పారు. బులెట్ ట్రైన్ల క‌ల త్వ‌ర‌లో సాక‌రం అవుతుంద‌న్నారు. దేశంలో 35 శాతం విద్యుధీక‌ర‌ణ ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. రైల్వే ఆధునికీక‌ర‌ణ‌తో దేశంలోని ముఖచిత్ర‌మే మారుస్తోంద‌న్నారు. నాలుగు విభాగాలుగా రైల్వేను అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. దేశంలో మెట్రో సేవ‌లు వెయ్యి కిలోమీట‌ర్ల మైలు రాయి దాటింద‌న్నారు. 2001లో అయిదు న‌గ‌రాల‌కే ప‌రిమిత‌మైన మెట్రో సేవ‌లు.. ఇప్పుడు 21 న‌గ‌రాల‌కు విస్త‌రించాయని తెలిపారు.

వేల కోట్లు ఖ‌ర్చుతో రైల్వే అభివృద్ధి
రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ స‌హాయ‌ మంత్రి సోమన్న అన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను రైల్వే అభివృద్ధికి ఖర్చు చేస్తోందని తెలిపారు. అమృత్ భారత్ స్కీం కింద అనేక రైల్వే స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేశామ‌న్నారు. చర్లపల్లిలో రైల్వే టెర్మినల్‌గా అభివృద్ధి చేశామన్నారు. ఈ కొత్త టెర్మినల్ రావడంతో హైదరాబాద్‌లో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయన్నారు. న్యూ ట్రైన్స్ త్వరలో ప్రారంభవుతాయని తెలిపారు.

మెట్రో విస్తరణకు సహకరించండి : సీఎం రేవంత్ రెడ్డి


రాష్ట్రంలో మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకామనీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. డ్రైపోర్టు ఇవ్వాలని కోరారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

రైల్వేలో సంస్కరణలు తీసుకొచ్చాం : కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

పదేళ్ల పాలనలో భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ‌ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ₹413 కోట్లతో ఎయిర్‌పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నిర్మించామని పేర్కొన్నారు. తెలంగాణ లో 100 శాతం లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని అన్నారు. హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందన్నారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹వెయ్యి కోట్ల ఇంకా రావాల్సింది ఉందన్నారు. వారు ఇవ్వకపోయినా యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌ పొడిగించామని అన్నారు. అదేవిధంగా కొమురవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రణాళికాబ‌ద్ధంగా మూడు రంగాల్లో అభివృద్ధి : కేంద్ర మంత్రి బండి

ఎన్డీఏ రాకముందే రైల్వే స్టేషన్లు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా మూడు రంగాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైల్వే, రోడ్డు, విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ₹ 32 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ₹2 వేల కోట్లతో అమృత్ స్కీం కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ₹430 కోట్లతో ఆత్యాధునిక టెర్మినల్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేసుకోవాలి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

రైల్వే నెట్​వర్క్​ పెంచేలా సహకరించాలి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కొత్త రైల్వే లైన్లు కావాలని ఎన్నో ఏళ్లుగా అడిగామని, తాము కూడా కేంద్రానికి సాకారం అందించామని చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐటీ ప‌రిశ్ర‌మల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైల్వే నెట్​వర్క్​ పెంచేలా సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రారంభించనున్న ఈ టెర్మినల్ కు రైల్వే అప్రోచ్ కు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు విడుదల చేయాలని, అప్రోచ్ రోడ్లు, ప్రయాణికుల కోసం కేంద్రం కొంత సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప మనసుతో ₹400 కోట్లకు పైగా ఖర్చు చేసి టెర్మినల్ నిర్మించారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రైల్వే స్టేషన్లలో దుర్గంధంతో ఉండేవి.. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడేలా రైల్వే స్టేషన్‌లను నిర్మిస్తున్నారని అన్నారు. రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టులను తలపించేలా నిర్మిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement