ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రాష్ట్ర ఖజానాకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో పెనుమార్పుల దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ వద్దే ఉన్న ఈ శాఖకు తాజాగా ఐజీగా రాహూల్బొజ్జాను నియమించిన సీఎం కేసీఆర్ త్వరలో ఒక సీనియర్ అధికారిని ఓఎస్డీగా నియమించినున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ ప్రతిపాదన సీఎం కేసీఆర్ వద్ద పెండింగ్లో ఉంది. ఈ శాఖలో పలు సంస్కరణలు, కొత్త విధానాలతో బలోపేతానికి, భారీ రాబడికి బాటలు వేసిన సదరు అధికారి సేవలను విస్తృతంగా వాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జాయింట్ ఐజీగా పనిచేసిన వేముల శ్రీనివాసులు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో విప్లవాత్మక, వినూత్న విధానాలను అమలులోకి తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖ ఆర్జించిన ఆదాయంకంటే రెట్టింపు రాబడిని తీసుకొచ్చేందుకు కీలకంగా నిల్చారు. ఈ నేపథ్యంలో గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి పుంజుకుంటూ పురోగమిస్తున్నది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ విజయవంతంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు.
విప్లవాత్మక సంస్కరణలను అమలులోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ అనుసరిస్తున్న చట్టాలు పురాతమైనవిగా ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో రూపొందించిన భారత స్టాంపులు, ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టాలే ఇంకా మనుగడలో ఉండటం, తాజాగా రిజిస్ట్రేషన్ల విషయంలో నెలకొన్న సందిగ్ధతలకు ఇటీవలే సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును ఇచ్చి తెలంగాణ సర్కార్ ఇచ్చిన ఆదేశాలకు అండగా నిల్చింది. ఈ నేపథ్యంలో మరోసారి సొంత చట్టం అంశం తెరపైకి వస్తోంది. తాజాగా ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు, భూ చట్టాల్లో సవరణలు, మ్యుటేషన్లలో కొత్త విధానం, రెవెన్యూ రికార్డులకు ప్రత్యేక వెబ్సైట్ల అమలుతో విజయాల పరంపరకు చేరువైన తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టాలపై జోరుగా చర్చ చరుపుతోంది. ఈ మేరకు అసెంబ్లి సమావేశాల్లో నూతన రిజిస్ట్రేషన్ చట్టం ముసాయిదాపై చర్చ జరపాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.