Friday, September 20, 2024

New Invention – కంది ఐఐటీలో డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్ రెడీ

సాంకేతిక అభివృద్ధి చేసిన టిహాన్‌
కంది క్యాంపస్​లో సేవ‌లందిస్తున్న వైనం
మ‌న దేశానికి అనుకూలంగా త‌యారీ
స్టార్ట్‌ప్ కంపెనీల‌ను ఆహ్వానిస్తూ నోటిఫికేష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సంగారెడ్డి: హైద‌రాబాద్ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్ ట్ర‌య‌ల్ ర‌న్ విజ‌య‌వంత‌మైంది. స్టార్ట‌ప్‌ కంపెనీలు ముందుకొస్తే మ‌రి కొద్ది నెల‌ల్లో రోడ్డెక్కే అవ‌కాశాలు ఉన్నాయి. ఐఐటీలోని ప్రత్యేక పరిశోధన విభాగం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) ఈ వెహిక‌ల్ సాంకేతిక అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలని నోటిఫికేషన్ జారీ చేసింది.

- Advertisement -

ఇప్ప‌టికే అమెరికాలో…
డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్స్‌ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని అందుబాటులో ఉన్నాయి. అక్క‌డ సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అమెరికా రోడ్లకు, ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ‌, ట్రాఫిక్ నిబంధ‌న‌లు, ఇత‌ర అంశాలకు భార‌త‌దేశానికి, అమెరికాకు వ్య‌త్యాసం ఉంది.

మ‌న దేశాన్ని దృష్టిలో పెట్టుకుని….

మ‌న దేశాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్స్ ను టిహాన్ రూపొందించింది. మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా అటానమస్ వాహనాల సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్లను వినియోగించింది. ఈ ప్రాజెక్టులో ఐఐటీ (హైద‌రాబాద్‌)కు చెందిన‌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ఇప్పటికే వీటిని ఐఐటీ కాంప‌స్‌లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి క్యాంప‌స్‌లో అన్ని ప్రాంతాల‌కు విద్యార్థుల‌ను, ప్రొఫెస‌ర్లు, సిబ్బందిని చేరవేస్తున్నాయి.

వేలాది మంది డేటా సేక‌రించి…

మ‌న దేశంలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు అనుకూలంగా డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్ రూపొందించారు. ఇందుకోసం వేలాది మంది డాటాను సేక‌రించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్డు వ్యవస్థను, దాంతోపాటు ప్రధాన నగరాలలో ఉన్న ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా త‌యారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి మూడు సంవత్సరాల పాటు చేసిన‌ పరిశోధన ఫలితంగా పూర్తి స్థాయిగా ఈ వెహిక‌ల్ రూపొందించారు.

స్టార్ట‌ప్ కంపెనీల‌కు ఆహ్వానిస్తూ నోటిఫికేష‌న్ జారీ
డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్ కోసం స్టార్ట‌ప్ కంపెనీలు ముందుకు రావాల‌ని హైద‌రాబాద్ ఐఐటీ నోటిఫికేష‌న్ జారీ చేసింది. మూడేళ్ల‌పాటు టిహాన్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప‌రిశోధ‌న‌లు చేశారని ఐఐటీ డైరెక్టర్ బి.ఎస్ మూర్తి, ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి వెల్ల‌డించారు. మంచి ఫ‌లితాలు రావ‌డంతో సోమ‌వారం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వెహిక‌ల్ కోసం వివ‌రించారు.

అద్భుతం.. మ‌హా అద్భుతం …
హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు రూపొందించిన డ్రైవ‌ర్ లెస్ వెహిక‌ల్‌లో ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ప్ర‌యాణించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ మ‌హా అద్బుతంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. ఎంతో అనుభూతి పొందిన‌ట్లు చెప్పారు. తెలంగాణ‌లోని ఐఐటీ క్యాంప‌స్ రూపొందించిన ఈ వెహిక‌ల్ మన దేశానికే గర్వ కార‌ణ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement