తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 2,3 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు, 29, 30 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, వరుసగా రాష్ట్రంలో వివిధ నియామకాలకు సంబంధించి పరీక్షలు జరుగుతుండడంతో గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీని కోరుతున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారని మంత్రి కేటీఆర్ శనివారం తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంప్రదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. ఆదివారం పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. రాష్ట్రంలోని 283 గ్రూప్-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి వరకు దరఖాస్తులు స్వీకరించగా.. దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు