Thursday, November 21, 2024

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లపై సరికొత్త నియంత్రణలు.. క్యూఆర్ కోడ్ లను వాడే దిశగా సర్కారు కసరత్తు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేస్తున్న వాహనాల స్టిక్కర్ల దుర్వినియోగాన్ని కట్టడి చేసే దిశగా సర్కారు దృష్టి సారించింది. ఈ స్టిక్కర్ల పేరుతో ఇటీవలె పలు అక్రమాలు, అనైతిక కార్యకలాపాలు బయట పడడంతో దిద్దుబాటు చర్యలకు సిద్ద‌మైంది ప్ర‌భుత్వం. వాహనాల స్టిక్కర్లకు అధునాతన సాంకేతిక పద్థతిలో బార్‌ కోడింగ్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను వర్తింపజేయాలని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్టు అసెంబ్లి వర్గాలు వెల్లడించాయి. ఇకపై ఏ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీలకు వాహన స్టిక్కర్లు ఇచ్చినా వాటిపై ఆ వ్యక్తి పేరుతో పాటు సదరు వాహన నెంబర్ కూడా ప్రింట్‌ చేయనున్నారు. ప్రతియేటా ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీకి మూడు స్టిక్కర్లను ప్రభుత్వం జారీ చేస్తోంది. అనివార్య కారణాలతో స్టిక్కర్లు పనికి రాకుండాపోయిన పక్షంలో వాటి స్థానంలో అదనంగా మరో రెండు స్టిక్కర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా అనేక ఘటనల్లో పలు అనైతిక కార్యకలా పాల్లో పలుపంచుకుంటున్న వ్యక్తుల వాహనాలకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ, మంత్రుల స్టిక్కర్లు ఉండడం వాటిని దుర్వినియోగం చేసి పోలీసులను బెదిరించిన ఘటనలు ప్రభుత్వ దృష్టికి రావడంతో కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇకపై వాహన స్టిక్కర్లపై ఒక ఏడాది మాత్రమే పని చేసేలా గడువు తేదీని కూడా ముద్రించనున్నారు.

తాజా మల్లారెడ్డి పేరుతో జారీ అయిన స్టిక్కరు క్యాసినో నిందితుడు మాధవరెడ్డి కారుకు ఉండడం, గతంలో బంజారాహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న వాహనాన్ని నిందితులు వాడడం, హైదరాబాద్‌లో బాలిక మరణానికి కారణమైన మహీంద్రా థార్‌ వాహనానికి కూడా ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో వీటిని నియంత్రించాల్సిన అవసరం నెలకొందని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులను, టోల్‌ప్లాజా సిబ్బందిని ఆయా స్టిక్కర్ల పేరుతో ఉన్న వాహనదారులు బెదిరింపులకు గురి చేసిన ఘటనలు కూడా జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎవరి పేరుతో జారీ చేసిన స్టిక్కర్‌కు ఆయా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బాధ్యులను చేసేలా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement