సంక్రాంతి పండగ వేళ ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్తను పండగకు భార్య కొత్త బట్టలు కొనివ్వాలని కోరింది. జీతం డబ్బులు రాలేదని.. అయినా కొనిస్తానని భర్త చెప్పగా.. ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య మనస్థాపానికి గురై తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పెంటలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ పెంటలో ఉన్న చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వారికి 8 మంది సంతానం. చిన్ననాగమ్మ కొత్తబట్టల కోసం భర్తతో గొడవపడింది. భర్త ఇంటి నుండి వెళ్లి వచ్చే సరికి చిన్న నాగమ్మ తనకున్న నలుగురి సంతానంలో యాదమ్మ (1), బయమ్మ (3) ఇద్దరు ఆడపిల్లలను గొంతు నులిమి చంపేసింది. ఆపై తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్గా పనిచేస్తున్నాడు. తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు. ఇటీవల తాను ఫైర్ లైన్ కూలీ పని చేసిన డబ్బులు రావడంతో కొత్త బట్టల కోసం మన్ననూర్ గ్రామానికి వెళ్ళాడు. అంతలోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టిందని గూడెం వాసులు వాపోయారు. ముక్కుపుచ్చలారని పిల్లలను తన చేతులారా చంపి తాను ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.