Friday, September 13, 2024

గిరిజన గ్రామాలకు ‘కొత్త’ శోభ .. త్వరలో పంచాయతీ భవనాల నిర్మాణం

గిరిజన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీ భవనానికి రూ.25 లక్షల చొప్పున నిధులు వెచ్చిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీని కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 1,177 ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలను ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఏజెన్సీ, ఎస్టీ రిజర్వు ప్రాంతాల్లోని మొత్తం 3,146 గ్రామాలకు గాను 1,892 గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటితోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని గుర్తించింది.

ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఇటీవల తమ శాఖల ఉన్నతాధికారులతో సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించి.. కొత్తగా నిర్మించే గ్రామ పంచాయతీ భవనాల నమూనా, నిర్మాణ వ్యయం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. అనంతరం ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని గ్రామ పంచాయతీల వాస్తవ స్థితిగతులపై గిరిజన సంక్షేమ శాఖ అధ్యయనం చేసింది. నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కో గ్రామంలో 1,000 చదరపు గజాల స్థలాన్ని గుర్తించాలని, భవన నిర్మాణాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సర్పంచ్‌లను, గ్రామ కార్యదర్శులను ఫ్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయినట్టు ప్రభుత్వానికి నివేదిక అందగానే కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, ఇందుకు నిధుల కొరత లేదని గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement