హైదరాబాద్: ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించడం కోసం ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరా పార్క్ నుండి వీఎస్టీ వరకు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్న నేపధ్యంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర అధికారులతో కలిసి బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, వీఎస్టీ జంక్షన్లలో వాహనాల రద్దీతో నిరంతరం ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను దూరం చేయాలనే ఆలోచనతోనే మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో ఇందిరా పార్క్ నుండి వీఎస్టీ జంక్షన్ వరకు 2.62 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జిని నిర్మించడం జరిగిందని తెలిపారు.
ఈ బ్రిడ్జి శనివారం నుండి ప్రజలకు వినియోగంలోకి వస్తుందని, బ్రిడ్జి ప్రారంభంతో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని వివరించారు. ఈ స్టీల్ బ్రిడ్జికి మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి నామకరణం చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. నాయిని నర్సింహారెడ్డి మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, కార్మికుల పక్షపాతిగా పనిచేశారని, ఆ సేవలకు గౌరవ సూచకంగా బ్రిడ్జికి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించే విధంగా పెద్ద ఎత్తున రోడ్డు కనెక్టివిటీ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే మూసీ నది అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూసీ నది వెంట ఇండ్లను నిర్మించుకొని నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సుమారు 10వేల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. ఇదే కాకుండా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, సీఆర్ఎంపీ కార్యక్రమం క్రింద రోడ్ల నిర్మాణం, పుట్ పాత్ ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంటే ఒక్క రూపాయి తెలేనోళ్ళు, అధికారంలో ఉన్ననాడు ప్రజల బాగోగులను విస్మరించినోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతం నుండి ఎంపీ గా గెలిచి నాలుగున్నర సంవత్సరాల నుండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో గొప్పగా బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం మేరకు ప్రభుత్వం నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం 9.50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తుందని వివరించారు. దేశాన్ని 50సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు జరిగిన మేలు శూన్యమన్నారు. నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, ప్రాజెక్ట్స్ సీఈ దయానంద్, ఎస్ఈ రవీందర్ తదితరులు ఉన్నారు.