Tuesday, November 26, 2024

New Alliance – కాంగ్రెస్ తో వామపక్షాలు…. సీట్లు సర్దుబాటే తరువాయి..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: తెలంగాణలో అసెంబ్లి ఎన్నికల సమయం సమీపి స్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో జత కట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ స్నేహహస్తం చాటుతోంది. ఇప్పటీ వరకు కారులో షికా రు చేయాలని భావించిన వామపక్ష పార్టీలకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ షాక్‌ ఇవ్వడంతో.. కాంగ్రెస్‌ పార్టీ కామ్రెడ్స్‌తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్న పట్టుదలతో ఉన్న కమ్యునిష్టు పార్టీలతో జత కడితే.. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో లాభం జరుగుతుందనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ నాయకులు న్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మానిక్యం ఠాగూర్‌ ఉభయ కమ్యునిష్టు పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలిసింది.

రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసి ముందుకెళ్లదా మని ఠాక్రే కోరినట్లుగా సమాచారం. కాగా, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకోవడం.. మరో వైపు కాంగ్రెస్‌ నుంచి పొత్తు ఆఫర్‌ రావడంతో తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ కీలక నేతలు కూడా కామ్రేడ్లతో జత కడితే ఎక్కడెక్కడ మంచి ఫలితం ఉటుంది..? పొత్తులో భాగం గా ఎన్ని సీట్లు .. ఏయే జిల్ల్లాల నుంచి ఎన్ని ఇవ్వొచ్చు..? కమ్యునిష్టుల బలమెంత..? అని కాంగ్రెస్‌ అధినాయకత్వం కూడా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను అడిగి తెలుసు కున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కమ్యునిష్టులతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని నియోజక వర్గాల్లో పట్టున్నట్లు గా వివరించారు. కమ్యునిష్టు పార్టీలతో కలిసి అడుగేయడం మంచిదేనని, కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలకు కూడా లభం జరుగుతోందని, పొత్తు విషయంలో వేరే ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి కాంగ్రెస్‌ పెద్దలు వచ్చినట్లు గా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చించిన మాట వాస్తవమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా స్పష్టం చేశారు. కమ్యుని ష్టుల గౌర‌వానికి భంగం కలుగకుండా ఉంటే కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే కాంగ్రెస్‌ ముందు కొన్ని ప్రతిపాదలను పెట్టినట్లుగా చెబుతున్నారు. మా ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ పార్టీ అంగీకరిస్తేనే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని, అయితే పొత్తులపై ఏ నిర్ణయం తీసుకున్నా సీపీఎం పార్టీని కూడా సంప్ర దించాకనే తుది నిర్ణయం ఉంటుందని సీపీఐ స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్‌తో కలిసినా, కలవకున్నా సీపీఎం పార్టీతో కలిసే వెళ్తామని కూడా చెబుతున్నారు.

కాగా, ఆదివారం జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ కాంగ్రెస్‌తో పొత్తుపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. అయితే పొత్తులపై తొందర పడాల్సిన అవసరం లేదని సీపీఎం పార్టీ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ దగ్గరవుతోందని, కాంగ్రెస్‌ నుంచి నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తేనే చర్చలు చేస్తామని, పొత్తులపై ఏం చేయాలనేదానిపై సీపీఐతో కలిసే ఆలోచిస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అయితే రెండు వామపక్ష పార్టీల నాయకులు కలిసి ఓసారి మాట్లాడు కుంటే క్లారిటీ వస్తుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

- Advertisement -

నాలుగు సీట్లు కావాలి.. రెండు సీట్లు ఇస్తాం..
వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో పొత్తు కుదిరితే తమకు నాలుగు అసెంబ్లి సీట్లు ఇవ్వాలని సీపీఐ పార్టీ కాంగ్రెస్‌ ముందు ప్రతిపాదన పెట్టినట్లుగా తెలిసింది. మునుగోడు, హుస్నాబాద్‌, బెల్లంపల్లి, కొత్తగూడెం అసెంబ్లి స్థానాలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అయితే కాంగ్రెస్‌ హై కమాండ్‌ మాత్రం మునుగోడు, హుస్నాబాద్‌తో పాటు ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే వామపక్షాలకు కనీసం చెరో మూడు స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫైనల్‌గా ఎవరికీ నష్టం జరగకుండా సీట్ల సర్దుబాటుకి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఢిల్లి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. ఇరు పార్టీలు కలిసి చర్చించుకుంటే త్వరలోనే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement