Friday, November 22, 2024

HYD: భారీ చోరికి పాల్పడ్డ నేపాలీ గ్యాంగ్ అరెస్ట్… రూ.5.5 కోట్ల బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: నగరంలోని రాంగోపాల్‌పేట పీఎస్‌ పరిధిలో చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకుని… వారి నుంచి రూ.5.5 కోట్ల విలువ చేసే బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముంబయి మీదుగా నేపాల్‌ పారిపోయేందుకు యత్నిస్తుండగా వారిని నార్త్‌ జోన్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంగోపాల్‌పేట పీఎస్‌ పరిధి సింధు కాలనీలో రాహుల్‌ గోయల్‌ అనే వ్యక్తి తన నలుగురు అన్నదమ్ములతో కలిసి ఉంటున్నారు. వారి ఇంట్లో కమల్‌ అనే నేపాలి వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం రాహుల్‌ గోయల్‌ తన కుటుంబంతో కలిసి నగర శివారులోని ఫామ్‌హౌస్‌కి వెళ్లారు.

సోమవారం సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలను ఎవరో పగులగొట్టినట్లు ఆయన గుర్తించారు.వాచ్‌మెన్‌ కుటుంబం కనిపించకపోవడంతో ఆయనపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు రాహుల్‌ ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నార్త్‌జోన్‌ పోలీసులు.. నిందితులను ముంబయిలోని మధుర బస్‌స్టేషన్‌లో పట్టుకున్నారు. కమల్‌ భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి కమల్‌ పారిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం మధుర బస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement