వాజేడు, (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా వాజేడు మండలంలో వరద బాధిత కుటుంబాలకు సరైన సాయం అందడం లేదు. గోదావరి వరదల కారణంగా వాజేడు, నాగారం, ఇప్పగూడెం, సుందరయ్య కాలనీ, దూలాపురం, గుమ్మడిదొడ్డి, చీకుపల్లి, పెద్ద గొల్లగూడెం, కడేకల్, కృష్ణాపురం, టేకులగూడెం, చంద్రుపట్ల, బొమ్మనపల్లి తదితర గ్రామాల్లో ఇండ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంపునకు గురైన గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులు.. నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వరద బాధిత కుటుంబాలు లబ్ధి కోల్పోవాల్సి వస్తోంది.
ప్రభుత్వం నియమించిన సర్వే బృందం సమగ్ర సర్వే నిర్వహించి 970 కుటుంబాలు ఇండ్లు ముంపునకు గురయ్యాయని నివేదిక తయారు చేసింది. కాగా, వాజేడు మండలం రెవెన్యూ అధికారులు మాత్రం 758 కుటుంబాల ఇండ్లు మాత్రమే ముంపునకు గురయ్యాయని నివేదిక తయారు చేశారు. ఇట్లా అధికారుల తప్పిదం వలన గోదావరి వరద ముంపునకు గురైన నిరుపేద అమాయక కుటుంబాలు లబ్ధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని స్థానిక జెడ్పీటీసీ పుష్పలత కోరుతున్నారు.