Sunday, November 3, 2024

Vikarabad : పనుల్లో నిర్లక్షం… ఏఈని తొలగించిన కలెక్టర్

వికారాబాద్, జులై 6 (ప్రభ న్యూస్) : మన ఊరు – మనబడి పాఠశాలల నిర్మాణపు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి తాండూర్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ను విధుల నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు మనబడి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన ఊరు – మనబడి పనుల్లో జిల్లా వెనుకబడి ఉందని, నిధుల కొరత లేనప్పటికిని పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. అధికారులు మనసు పెట్టి పని చేయాలని, ఏమైనా సమస్యలుంటే వాటిని అధిగమించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మన ఊరు మనబడి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాండూర్ టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఏఈ శ్రీనివాస్ ను విధుల నుండి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనుల్లో ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇంకా కొన్ని మండలాల్లో పనులు ప్రారంభం కాలేదని, అన్ని పనులను వెంటనే ప్రారంభించి జులై 31 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని, పెండింగ్ బిల్లులకు సంబంధించి ఎఫ్ టి ఓ లు అప్లోడ్ చేస్తే డబ్బులు వెంటనే చెల్లించడం జరుగుతుందన్నారు. ఇక ప్రతి వారం మన ఊరు మనబడి పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాకు కొత్తగా 269 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, సోమవారం వరకు గ్రౌండింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులకు ఎన్నికల విధుల్లో భాగంగా సెక్టర్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అవసరమైన శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుకాదేవి, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఏఈలు, డీఈలు, ఈఈ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement