Tuesday, November 26, 2024

నీరా కేఫ్ ప్రారంభం – కృత‌జ్ఞ‌త‌గా కెసిఆర్, కెటిఆర్ చిత్ర‌ప‌టాల‌కు నీరాభిషేకం..

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో క‌లిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్ర‌కృతి సిద్ధ‌మైన, స్వ‌చ్ఛ‌మైన నీరాను ఈ కేఫ్ ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు. కాగా,గీత వృత్తిదారులకు రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమాను ప్రకటించిన సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రప‌టాల‌కు ‘నీరాభిషేకం’ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గీత వృత్తి ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికుల కోసం రూ. 5 ల‌క్ష‌ల బీమాను కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 ఏండ్ల వయస్సు పైబడిన, అర్హులైన దాదాపు లక్ష మంది గీత కార్మికులకు ప్రతి నెల రూ. 2016 ల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. మ‌ద్యం దుకాణం కేటాయింపుల్లో గౌడ సామాజిక వ‌ర్గానికి 15 శాతం, ఎస్సీ, ఎస్టీల‌కు 15 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం సాహోసోపేత‌మైన నిర్ణ‌యం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

గీత వృత్తి ప్రోత్సాహం కోసం తెలంగాణకు హరితహారంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల 20 లక్షల తాటి, ఈత మొక్కలు నాటిన‌ట్లు శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికి వేసే వారిపై చట్టపరమైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన నీరాను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టామ‌ని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తిదారులు మాత్రమే నీరాను ఉత్పత్తి చేసి, అమ్మకాలు జరిపేలా నీరాపాలసీని రూపొందించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement