ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభన్యూస్): సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా పటాన్ చెరు కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు ఈసారి పటాన్ చెరు స్థానాన్ని ఆశించారు. అయితే ఇటీవల ప్రకటించిన జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. ముదిరాజ్ కోటాలో పటాన్ చెరు స్థానాన్ని ఆశించిన నీలం మధుకు నిరాశే మిగిలింది.
ఆయన అభిమానులు నీలం మధుకు సీటు ఇవ్వాలని కోరుతూ గత కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా ముదిరాజ్ లకు కనీసం ఒక్క సీటైనా ఇవ్వాలని, ఆ సీటు పటాన్ చెరు ది అయి ఉండాలని డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీలం మధు నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా నీలం మధు రాజకీయ భవిష్యత్ పై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, యదావిధిగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.