Tuesday, November 26, 2024

ఎన్డీఆర్ఎఫ్ బృందం సేవలు భేష్ -మంత్రి పువ్వాడ


ఖమ్మం : మున్నేరుకు భారీ వరద సందర్భంగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం చేరుకొని 78మంది ప్రాణాలు కాపాడిన ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఉదయం మున్నేరు తగ్గుముఖం పట్టడంతో ఎన్టీఆర్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. వారికి ధన్యవాదాలు చెప్పేందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మున్నేరు చరిత్రలో ఇంత వరద ఉధృతి చూసింది ఇదే ప్రథమమన్నారు. సుమారు 5లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందనీ, ఎంత వేగంగా వచ్చింది వరద అంతా వేగంగా వెళ్ళిందన్నారు.


ఎవరూ ఊహించని విధంగా వరద ఉధృతి వచ్చిందనీ, 26 అడుగులు దాటి వరద ఉధృతి ఎప్పుడు రాలేదు.. కానీ ఈసారి 30 అడుగుల పైన వరద ఉధృతి వచ్చిందనీ పేర్కోన్నారు. వరద సమయంలో సహకరించిన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సహజంగా వరద సమయంలో అనుభవం ఉండదు కానీ, దాని సమర్థవంతంగా ఎదుర్కొని పని చేశామని, అందరినీ కూడా రక్షించామన్నారు. కొత్తగూడెం కోసం వెళ్తున్న ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాన్ని సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఖమ్మంకు తీసుకుని వచ్చామనీ వివరించారు. వారు వచ్చే సమయానికి చీకటి పడిందనీ, ఆ సమయంలో కాపాడతారో లేరో అనుకున్నాం కానీ వారు అందరినీ రక్షించారన్నారు. 6 నెలల పాప నుండి ముసలి వారి వరకు అందరినీ రక్షించామనీ, చివరి వ్యక్తిని కూడా తాము రక్షించామన్నారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ధన్యవాదాలు అని, అందుకే వారిని సత్కరించామన్నారు. చెరువులు అన్ని కూడా నిండు కుండను తలపిస్తున్నాయని పేర్కోన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో మనమంతా కలిసి పని చేయాలనీ కోరారు.


భద్రాచలం వద్ద గోదావరిలో 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి పడనుందనీ తెలిపారు. ఇప్పటికే 2 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు భద్రాచలంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ బృందాన్ని కూడా తీసుకువెళ్తామన్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్ వద్ద ఇంటిలో సామాన్ల కోసం వెళ్లి వస్తు సతీష్ మరణం దురదృష్టకరమన్నారు. అతను రెండు సార్లు వెళ్లి మూడవసారి అధికారులు వెల్లోద్దని చెప్పినా మూడవసారి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని మంత్రి పువ్వాడ అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర సమయంలో అధికారుల మాటలు వినాలనీ, ఆ ఒక్క ఘటన జరగకుండా ఉండి ఉంటే బాగుండేదని తెలిపారు. మీడియా మిత్రులు కూడా చాలా రిస్క్ చేస్తున్నారనీ ప్రస్తావించారు. మళ్లీ పై నుండి వరద వస్తే ప్రజలు పునరావాస కేంద్రాలకు తిరిగి రావాలనీ, అక్కడ మీ కోసం అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ప్రాణాలను సురక్షితంగా ఉండాలని ఆదేశించారన్నారు.

- Advertisement -


భద్రాచలంలో సుమారు 60 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అనుకోని వరదలు వచ్చాయన్నారు. వాటిని మేమంతా కలిసి సమిష్టిగా ఎదుర్కొన్నామని, ఈ వరదలను కూడా ఎదుర్కొంటామని తెలిపారు. అవసరం కోసం హెలికాప్టర్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దో రేపల్లి శ్వేత, పగడాల నాగరాజు, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో శైలజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement