హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర పోలీసుల యూనిఫాం రంగు త్వరలోనే మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఖాకీ యూనిఫాంకు బదులుగా నెవీ బ్లూ యూనిఫాంను అమలులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. రాష్ట్ర పోలీసుల యూనిఫాంను మార్చాలంటూ గత కొన్నేళ్ళుగా పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారుల ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ ఏ కారణం చేతనో తెలియదు కానీ కార్యరూపంలోకి రాలేదు.
తాజాగా మరోసారి పోలీసు యూనిఫాంరంగు మార్పు అంశం తెరపైకి వచ్చింది. ర్యాంక్ వారిగా అధికారుల స్థాయిని సులభంగా గుర్తు పట్టేందుకు యూనిఫాంలో మార్పు చేయాలని భావిస్తున్నారు. హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎఎస్‌ఐ, ఎస్‌ఐ స్థాయి వరకు యూనిఫాంలో మార్పులు చేయాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేశారు. పోలీసు యూనిఫాంలో మార్పులకు సంబంధించి హోం శాఖ కార్యదర్శితో సీఎంవోకు అధికారులు ప్రతిపాదనలను పంపించారు. సీఎంవో నుంచి అనుమతి రాగానే కొత్త యూనిఫాం అమలులోకి వస్తుందని అంటున్నారు.
అంతేకాకుండా హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లతో పాటు వేర్వేరు కమిషనరేట్‌లలో పని చేసే పోలీసుల యూనిఫాం రంగును కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కమిషనరేట్‌కు ఏ రంగు, పోలీసులకు ఏ రంగు యూనిఫాం అనే అంశంపై స్పష్టత రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా హెచ్‌జె దొర పని చేసిన సమయం నుంచి పోలీసుల యూనిఫాం రంగు మార్పుపై ఎప్పటికప్పుడు అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపుతున్నప్పటికీ ఆచరణలోకి రావడం లేదు. తాజా ప్రతిపాదనలపై కూడా అధికారులు ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
కాకీ యూనిఫాంను ప్రస్తుతం పోలీసులతో పాటు ఆర్టీసీ, ఆటో కార్మికులు, కొన్ని ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు, కంపనీలు కూడా వినియోగిస్తున్నాయి. దీంతో కొన్ని సందర్భాలలో పోలీసులెవరూ, ఉద్యోగులెవరనే అంశంపై స్పష్టత ఉండటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉన్నతాధికారులు గత కొన్నాళ్ళుగా పోలీసులకు ఖాకీ డ్రస్ స్థానంలో మరో రంగు డ్రస్‌ను అందుబాటులోకి తీసుకు రావాలనుకుంటున్నారు. అయితే వేర్వేరు కారణాలతో ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు అలాగే ఉండిపోతున్నాయి. తాజా ప్రతిపాదనలకు మోక్షం రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే మరో రెండు మూడు మాసాలలో పోలీసులు కొత్త యూనిఫాంలో కనిపిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.