మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించింది. అభ్యర్థిగా నవీన్ కుమార్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్ కుమార్ స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు.
స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 4న నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 11 వరకు నామపత్రాలను దాఖలు చేయవచ్చు. నామినేషన్లను మార్చి 12న పరిశీలించనున్నారు. ఉపసంహరణకు గడువు మార్చి 14. ఈ నెల 28న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 2న ఓట్లను లెక్కిస్తారు.