హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఫోర్త్ వేవ్ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నా… రోజువారీ పాజిటివ్ కేసులు 1000 దాటినా జనం మాత్రం కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో, బూస్టర్ డోస్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రికాషనరీ/బూస్టర్‌డోస్/మూడో డోస్‌ను తీసుకోవడంలోనూ అంతులేని నిరాసక్తత చూపుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ప్రికాషనరీ డోస్ పంపిణీ శరవేగంగా జరుగుతుండగా తెలంగాణలో మాత్రం నత్తనడకన సాగుతోంది. 18-59 సంవత్సరాల మధ్య వయసు గల వారికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోస్‌ను ప్రకటించినా జనం మాత్రం ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి గత నెల 15కు ముందు బూస్టర్ డోస్ కేవలం 60ఏళ్ల పైబడిన వారికే ఉచితంగా అందించేవారు. అయితే దేశ వ్యాప్తంగా మళ్లి కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం 75 రోజుల వ్యవథిలో 18-59 ఏళ్ల మధ్య వయసు వారందరికీ ఉచితంగా ప్రికాషనరీ డోస్ ఇవ్వాలని నిబంధన విధించింది. అయితే జులై 15 నుంచి ఇప్పటి వరకు 20 రోజులు గడుస్తున్నా తెలంగాణలో మాత్రం రెెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కేవలం 3శాతం మంది మాత్రమే బూస్టర్/ప్రికాషనరీ డోస్ తీసుకున్నారు.
రాష్ట్రంలో బూస్టర్ డోస్‌కు అర్హులైన వారు మొత్తం 3, 23, 10,202 మంది ఉండగా అందులో ఇప్పటి వరకు 3, 10, 86, 191 మంది రెండు డోస్‌ల టీకా తీసుకున్నారు. వీరిలో ఈ 21 రోజుల వ్యవథిలో కేవలం 23, 11, 382 మంది మాత్రమే బూస్టర్ డోస్ టీకా వేయించుకున్నారు. రెండు డోస్‌ల టీకా తీసుకుని బూస్టర్ డోస్ టీకా తీసుకోవాల్సిన వారి సంఖ్య రాష్ట్రంలో 2, 17, 63, 351గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 25, 27, 130 వ్యాక్సిన్ డోస్‌లు నిల్వ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన 75 రోజల గడువులో ఇప్పటికే 20 రోజులు గడిచిపోవడంతో ఇక మిగిలి ఉంది కేవలం 50 రోజులు మాత్రమే . ఈ లోగా అర్హులైన అందరికీ బూస్టర్ డోస్ టీకా పంపిణీ జరుగుతుందా..? అన్న ఆందోళన వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణతో పోల్చితే దేశంలోని బీహార్ తదితర రాష్ట్రాల్లో బూస్టర్ డోస్ వేగంగా పంపిణీ అవుతోంది. తెలంగాణలో మొదటి, రెండో డోస్ టీకాలు వేగంగా పంపిణీ కాగా… బూస్టర్ డోస్ పంపిణీ మాత్రం మరీ నెమ్మదిగా సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదుకావడం, వైరస్ సోకిన వారు హోం ఐసోలేషన్ చికిత్సతో ఇంట్లోనే కోలుకుంటుండడంతో వైరస్ ఇక ఏమీ చేయలేదన్న భావనలో జనం ఉండిపోయారు. ఫలితంగా బూస్టర్ డోస్ తీసుకోకున్నా తమకు ఏమీ కాదన్న ధీమాతో జనం ఉన్నారు. బూస్టర్ డోస్‌తోనే కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డా. కిరణ్ మాదల చెబుతున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతోపాటు బూస్టర్ డోస్ తీసుకోవాలని , అప్పుడే వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో వృద్ధిచెందుతాయని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా రెండో డోస్ తర్వాత ఆరు నెలలపాటే టీకాతో వచ్చే యాంటీబాడీలు వైరస్‌ను నిలువరిస్తాయని, ఆ తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటేనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని స్పష్టం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.