Tuesday, November 19, 2024

తెలంగాణకు జాతీయ సంస్థలు.. కరీంనగర్‌లో ఐఐఎంను నెలకొల్పండి: మోడీకి బండి లేఖ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రానికి జాతీయ సంస్థలను మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) తో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) వంటి జాతీయ సంస్థలను మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాంతీయ అసమతుల్యతలను సమతుల్యం చేస్తూ దేశవ్యాప్తంగా జాతీయ సంస్థల స్థాపన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఆ లేఖలో గుర్తు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా 13 ఐఐఎం సంస్థలుంటే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మరో 7 సంస్థలను స్థాపించిన అంశాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు.

తెలంగాణలోనూ ఐఐఎంను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొత్తగా మంజూరు చేసే ఐఐఎంను కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన సంస్థలున్నందున క‌రీంన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ప్ర‌ఖ్యాత సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రమంతా సమగ్రాభివృద్దికి బాటలు వేసినట్లవుతుందని తెలిపారు. అదే విధంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) సంస్థ క్యాంపస్‌లు దేశవ్యాప్తంగా 6 మాత్రమే ఉన్నాయని లేఖలో పేర్కొన్న బండి సంజయ్ భౌగోళికరీత్యా తెలంగాణలో ఎన్‌ఐడీ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తద్వారా తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణను నిర్లక్ష్యం చేసినందున హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరంలో తక్షణమే ఎన్ఐడీని స్థాపించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ స్థాయి శాస్త్రీయ, విద్యా పరిశోధన (ఐఐఎస్ఈఆర్) సంస్థను ఏర్పాటు చేయాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గతంలో 4 ఐఐఎస్ఈఆర్ సంస్థలు మాత్రమే ఉండేవని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మరో రెండు (ఏపీ, ఒడిశా) ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఇచ్చిన హామీ మేరకు తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదని తెలిపారు. అయితే జాతీయ స్థాయి శాస్త్రీయ విద్యా మరియు పరిశోధనా సంస్థ ఏర్పాటుకు రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉన్నందున, తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement