వాజేడు, జులై 20 ప్రభ న్యూస్: గోదావరి అంతకంతకు పెరుగుతుండడంతో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో జాతీయ రహదారి నీట మునిగి అంతరాష్ట్ర రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ జాతీయ రహదారి గుండా ముంబై, భూపాలపట్నం, బీజాపూర్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వాహనాల ద్వారా ప్రయాణికులు ప్రయాణం సాగిస్తూ ఉంటారు.
ఈ అంతరాష్ట్ర రహదారి గోదావరి వరద ముంపునకు గురికావడంతో అటువైపుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయి రవాణా సౌకర్యం స్తంభించింది. కొంతమంది ప్రయాణికులు మోకాళ్ళ లోతు నీటిలో నడిచి వెళుతూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది కూడా పలుమార్లు ఈ జాతీయ రహదారి నీట మునిగి అంతర్రాష్ట్ర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. అధికారుల అలసత్వం వలన ఈ ఏడాది కూడా ప్రయాణికులకు గోదావరి ముంపు కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.