హైదరాబాద్; నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 31న విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో ఈడీ పేర్కొంది. కాగా, 2022 నవంబర్ 23న అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు తాజాగా మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాలని అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఇది ఇలా ఉంటే రూ. 2 వేల కోట్ల విలువైన అసెట్స్ , ఈక్విటీ లావాదేవీల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ధిక సహాయం అందించింది. మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. కేవలం రూ. 50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ఆస్తులను రికవరీ చేసుకునే హక్కును పొందిందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. దీనిపైనే ఈడి విచారణ కొనసాగిస్తున్నది.