Tuesday, November 26, 2024

25న అబ్బురపడేలా బిఆర్ఎస్ ప్లీనరీ స‌మావేశాలు ….. ఎమ్మెల్యే నరేందర్

వ‌రంగ‌ల్ – భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న నియోజకవర్గ ప్లీనరీని అబ్బురపడేలా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ప్లీనరీ జరగనున్న ఓ సిటీ ప్రాంతంలో ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్లీనరీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేయడం జరుగుతుందన్నారు. సువిశాలంగా వేదిక నిర్మాణం ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లను సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ప్లీనరీకి మొత్తం ఆరు వేల మంది హాజరవుతారని, వీరిలో ప్రత్యేకంగా కార్మికులు ఉంటారని తెలిపారు. పార్టీ సీనియర్ కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం పదవిలో ఉన్నవారు, పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారు తదితరులు ప్లీనరీకి తరలివస్తారని వివరించారు.

25న ఉదయం జెండా పండుగ
25వ తేదీ ఉదయం 8 గంటలకు డివిజన్లలో ఉత్సాహంగా జెండా పండుగ కొనసాగుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఇందులో పార్టీ జెండాను ఎగురవేస్తారని ఆయన పేర్కొంటూ నియోజకవర్గంలో 46కు పైగా జెండా గద్దెలున్నాయని, వాటికి ఇప్పటికే రంగులు వేశారని చెప్పారు. సమధికోత్సాహంతో డివిజన్లలో జెండా పండుగను ఆడంబరంగా జరుపుకొని మొత్తం శ్రేణులను వెంట తీసుకొని ఊరేగింపుగా ప్లీనరీ ప్రదేశానికి తరలివస్తారని ఆయన చెప్పారు. మంగళహారతులు, బతుకమ్మలు తదితర సంస్కృతి రూపాల్లో డివిజన్ల నుంచి కార్యకర్తలు ప్లీనరీ ప్రాంతానికి ఎంతో ఉత్సాహంగా తరలివస్తారని చెప్పారు. అయితే మొత్తం శ్రేణులను కదలించేందుకు ఇంతకు ముందు పక్కా కార్యాచరణతో తమ డివిజన్ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేశారని, బొట్టు పెట్టే కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు.

26న తొలి ఆత్మీయ సమ్మేళనం
ఈనెల 26వ తేదీన పుప్పాలగుట్టలోని పార్కులో తొలి ఆత్మీయ సమ్మేళనాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. ఈ సమ్మేళనంలో రెండు వేల మంది భాగస్వాములవుతారని ఆయన పేర్కొంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే ఉదయం 8 గంటలకు దేశాయిపేటలోని జర్నలిస్ట్ కాలనీలో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని తెలిపారు. 27న రాష్ట్ర లెజిస్లేటివ్ సమావేశం, 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం, 1న మేడే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మే 13వ తేదీ నుంచి వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగి 30వ తేదీన ముగుస్తాయని చెప్పారు. జూన్ నెల మొత్తం కార్మికులకు లేబర్ కార్డు ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా చేపడతామని ఎమ్మెల్యే నరేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement