Friday, November 22, 2024

సివిల్స్ లో తెలుగు విద్యార్ధుల హవా – నారాయ‌ణ‌పేట ఎస్పీ కుమార్తె ఉమాకి మూడో ర్యాంక్ …

హైద‌రాబాద్ – సివిల్స్ 2022 తుది ఫ‌లితాల్లో తెలంగాణ‌కు చెందిన నూక‌ల ఉమా హార‌తి ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఉమా హార‌తి తండ్రి నూక‌ల వెంక‌టేశ్వ‌ర్లు నారాయ‌ణ‌పేట ఎస్పీగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఉమా హార‌తి స్వ‌స్థ‌లం సూర్యాపేట జిల్లాలోని హుజుర్‌న‌గ‌ర్‌. కాగా, ఉమా సోద‌రుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో జాతీయ స్థాయిలో 12 వ ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈ నెలలో విధుల్లో చేరాడు. నేడు వెలువడిన యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో కూతురు ఉమా 3వ ర్యాంకు సాధించడం పట్ల ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, ఆయ‌న భార్య శ్రీదేవి సంతోషం వ్య‌క్తం చేశారు. ఉమా హార‌తికి శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.


ఇక తెలంగాణలోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం గుంటూరుప‌ల్లికి చెందిన శాఖ‌మూరి శ్రీసాయి హ‌ర్షిత్ 40వ ర్యాంకు, పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోని సుల్తానాబాద్ మండ‌లానికి చెందిన ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మండ‌లం ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ‌లం తుంగెడ‌కు చెందిన నిరుపేద బిడ్డ డోంగ్రీ రేవ‌య్య 410వ ర్యాంకు సాధించారు. తుంగెడ గ్రామానికి చెందిన మనోహర్, విస్తారి భాయ్ దంప‌తుల‌ కుమారుడు రేవయ్య కాగజ్ నగర్‌లోని శిశుమందిర్ లో ఒకటి నుండి 5వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు.

ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో, హైదరాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అనంతరం మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేష‌న్ ప్రారంభించాడు. ఉద్యోగం చేయ‌డం వ‌ల్ల స‌రిగా చ‌ద‌వ‌లేక‌పోతున్నాన‌ని చెప్పి.. ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిప‌రేష‌న్‌పై దృష్టి కేంద్రీకరించాడు. మొత్తంగా సివిల్స్ తుది ఫ‌లితాల్లో 410వ‌ ర్యాంకు సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. రేవ‌య్య త‌ల్లి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో వంట మ‌నిషిగా ప‌ని చేస్తుంది. తండ్రి గ‌తంలోనే మ‌ర‌ణించాడు.

సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపారు.. మొత్తం పలితాలలో 100 మందికి పైగా తెలుగు విద్యార్ధులు మంచి ర్యాంకుల సాధించారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్‌ దత్తాకు 22వ ర్యాంకు సాధించారు. ఇక, శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, శివమారుతిరెడ్డి 137వ ర్యాంకు, వసంత్ కుమార్ ఆర్ 157వ ర్యాంకు, కమతం మహేష్ కుమార్ 200, ఆర్ జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బీ ఉమహేశ్వరరెడ్డి 270వ ర్యాంకు, చల్లా కల్యాణి 285 ర్యాంకు, పీ విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, జీ సాయికృష్ణ 293వ ర్యాంకు, లక్ష్మి సుజిత 311, ఎన్ చేతనా రెడ్డి 346, శృతి యారగంటి ఎస్ 362వ ర్యాంకు, వై సుష్మిత 384వ ర్యాంకు సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement