పోలవరం ముంపు ప్రాంతాలపై తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ పరిధి పోలవరం ముంపు మండలాల్లోని ఐదు పంచాయతీల సమస్యపై.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి మాట్లాడుకుంటే రెండు నిమిషాల్లో పరిష్కారమవుతుందన్నారు. ఐదు పంచాయతీల సమస్య ఏడేళ్లుగా ఉందన్నారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు.
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భద్రాద్రి రామయ్యకి మొక్కుకున్నానని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో.. కరోనా కష్టాలు కడతేరాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో వుండాలని, తెలుగురాష్ట్రాలు సఖ్యతతో ఉండి పరస్పర ప్రయోజనాలు గౌరవించుకుని, ప్రగతిపథంలో సాగాలని ప్రార్ధించానని నారా లోకేష్ చెప్పారు.