యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నాలుగు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని కలెక్టర్ కలెక్టరు హనుమంతు కే.జెండగే అన్నారు. మంగళవారం జిల్లాలోని భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను గ్రామ సభ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాబితాలో లేని అర్హులు గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుండి 24 వరకు గ్రామ సభలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని చెప్పారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.