సూర్యాపేట, (ప్రభన్యూస్):ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్రాక్టీస్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మెడికల్ ఆఫీసర్లపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా జులిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర్యంలో జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాడులు జరిగాయి. ఈ మేరకు కేతేపల్లి మెడికల్ ఆఫీసర్ విజయకుమార్, మునగాల మెడికల్ ఆఫీసర్ యాదా రమేష్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రాక్టీస్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
కాగా, ఈవిషయంలో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయగా సోమవారం సదరు మెడికల్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం అందింది. గత నెల 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.