నల్గొండ – తెలంగాణలో బలపడుతున్నట్టు కనిపించిన బీజేపీ.. సాగర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సాగర్‌లో ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో కమలనాథులు తర్జనభర్జన పడ్డారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అనివార్యత ఏర్పడడంతో రవికుమార్ నాయక్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సాగర్ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేక పోయిందనే ఊహాగానాలు మొదల య్యాయి. దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో బీజేపీ అందరికంటే ముందుగానే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. అక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌రావు తమ పార్టీ అభ్యర్థి అనే సంకేతాలను దాదాపు మూడు మాసాల ముందుగానే స్పష్టంగా ప్రజల్లోకి పంపింది. దీంతో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోయిన కొద్ది రోజులకే రంగంలోకి దిగి ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు రఘునందన్‌రావు. స్వతహాగా మాటకారి కూడా కావడంతో ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించారు. ఇక గతంలో రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి కూడా బాగా కలిసొచ్చింది. రఘునందన్‌రావు విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు సాగర్‌లో అభ్యర్థి ఎంపిక సందర్భంగా వ్యవహరించలేదనే ఊహాగానాలు మొదలయ్యాయి. సాగర్ బరిలో బీజేపీ తరఫున టికెట్ ఆశించిన వారిలో నివేదితారెడ్డి, అంజయ్యయాదవ్ ఉన్నారు. వీరిలో ఒకరికి టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు. టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వీరిలో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని మరొకరిని బుజ్జగిస్తుందని చాలా మంది భావించారు. కానీ బీజేపీ మాత్రం రవికుమార్ నాయక్ పేరును ఖరారు చేయడంతో ఈ ఇద్దరు నిరాశకు గురయ్యారు. నివేదితారెడ్డి పార్టీలోనే ఉన్నప్పటికీ అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరి బీజేపీకి షాక్ ఇచ్చారు. దీంతో సాగర్‌లో బీజేపీ రాజకీయం అనుకున్నంత వ్యూహాత్మకంగా లేదనే చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కించుకున్న ఉత్సాహంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతుండగా ఆ ఓటమి నుంచి తేరుకుని టీఆర్ఎస్తో తలపడాల్సిన పరిస్థితిలో బీజేపీ ఉంది. సాగర్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించడంతో పాటు భారీ మెజారిటీతో గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement