.. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
నల్గొండ, ఆంధ్రప్రభ : జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలియజేశారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పమన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తాయన్నారు.
ఈవ్ టీజింగ్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, సమస్యల పరిష్కారానికి 24గంటల పాటు అందుబాటులో ఉంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఇకపై తరచూ బ్రీత్ అనలైజర్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదన్నారు. రవాణా శాఖ నిబంధనలు వాహనదారులు కచ్చితంగా పాటించాలని లేకపోతే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది పుష్పగుచాలు అందించి స్వాగతం పలికారు.