సూర్యాపేట : వరంగల్ సభ వేదికగా రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ట్రెండింగ్ అవుతున్న పీకే ఫ్యాక్టర్ పై స్పందించారు. మీడియా ద్వారానే పీకే విషయం వింటున్నానన్నారు. పీకే ఫ్యాక్టర్ పై అధికారిక సమాచారం లేదని, ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లి, అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో పంట పెట్టుబడి పెరిగి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఎరువులు లేవు, రుణమాఫీ చేయడంలో విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పంట భీమా లేని ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణా మాత్రమేనన్నారు. రైతులకు న్యాయం చేయలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ దీక్షలు చేస్తున్నాయన్నారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేసీఆర్ నిర్లక్ష్యంతో రైతులు నష్టానికి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. కేంద్రం నుండి వచ్చిన రూ.200కోట్ల పంట భీమా సొమ్ముని కేసీఆర్ పక్కదారి పట్టించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు, నాయకులు బైరు శైలేందర్ గౌడ్, అంజద్ అలీ, శ్రీనివాస్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement