పెన్ పహాడ్, ఏప్రిల్ 3(ప్రభన్యూస్): త్రాగునీరు ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం బ్రిడ్జి గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువ లో ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో నీరు డెడ్ స్టోరేజ్ కి చేరడంతో నాగార్జునసాగర్ ఎడమ కాలవ నుండి పాలేరు జలాశయాన్ని నింపడం కోసం మంగళవారం సాయంత్రం నీటిని విడుదల చేయడం జరిగిందని ఈ నీరు సూర్యాపేట జిల్లా దోస పహాడ్, అన్నారం బ్రిడ్జి దాటి ప్రవహిస్తున్నాయని ఈ నీటిని ఎవరు దుర్వినియోగం చేయకుండా ముందస్తుగా సూర్యాపేటలో 26 టీమ్ ఏర్పాటు చేసి 150 మంది సిబ్బందిని, 24 గంటలు కావలి ఉంచడం జరిగిందన్నారు. పాలేరు జలాశయం నిండితే మరో మూడు నెలల పాటు సూర్యాపేట జిల్లాలోని 393 ఆవాసాలు, 193 గ్రామపంచాయతీలు, రెండు మున్సిపాలిటీలకు తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని అన్నారు.
ఎన్ఎస్ పి కాల్వ కింద ఉన్న రైతులు ఎవరు కూడా తమ మోటార్లను ఆన్ చేయొద్దని అందుకు ముందస్తుగానే మోటర్లకు ఉన్న ఎలక్ట్రిషన్ కనెక్షన్ ను రెండు రోజులపాటు తొలగించడం జరిగిందన్నారు కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎఎస్పీ నాగేశ్వరరావు, తహసిల్దార్ మందడి మహేందర్ రెడ్డి, ఎస్సై పెరిక రవీందర్, ఆర్ ఐ సుందరిమట్టయ్య, పంచాయతీ కార్యదర్శి దివ్యభారతి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.