Saturday, November 23, 2024

ఉడుత‌కి ప్రాణం పోసిన బుడ‌త‌డు..ఆ కుటుంబాన్ని వ‌ద‌ల‌ని ఉడుత‌

శున‌కాలు..పిల్ల‌లు ఇలా ఎవ‌రికి న‌చ్చిన పెంపుడు జంతువుల‌ని వారు పెంచుకుంటుంటారు. అయితే వాటిని వారు ఏరీ కోరీ మ‌రీ తెచ్చుకున్న‌వే. కానీ ఓ ఉడుతు ఓ నిరుపేద కుటుంబంలో ఒక్క‌టిగా మార‌డం విశేషం. మ‌నుషుల‌ని చూస్తేనే ఉలిక్కి ప‌డి పారిపోయే ఉడుతు మ‌నుషుల‌తో క‌లిసి మెలిసి తిరుగుతోంది..ఎక్క‌డా అనుకుంటున్నారా..సూర్యాపేట జిల్లా కేంద్రంలో.. సూర్యాపేట – జనగామ హైవే పక్కన కలీం దంపతులు టీ స్టాల్, గాలి మిషన్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని కుటుంబం.ఈ కుటుంబ సభ్యులంతా ఇటీవల నెల్లూరులో ఓ శుభకార్యానికి వెళ్లారట. వారితో పాటు ఈ బుడతను కూడా తీసుకెళ్లారు. రైల్లో ప్రయాణికులు ఈ ఉడతను చూసి ఆశ్చర్యపోయారట. సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారట.

ఈ నిరుపేద దంపతుల కుమారుడు అస్లాం కారణంగా ఈ ఉడుతతో వీరికి బంధం పెనవేసుకుపోయింది. దీని వెనుక కళ్లు చెమర్చే క‌థ కూడా ఉంది. అస్లాం 8వ తరగతి చదువుతున్నాడు. ఫోన్ లో ఆన్లైన్ తరగతులు వింటూ తల్లిదండ్రులకు పనిలో సహకరిస్తున్నాడు. ఇలా ఉండగా.. 3 నెలల కిందట వీరి ఇంటి పరిసర ప్రాంతాలలో కాకులు పెద్దగా అరుస్తుండటం అస్లాం విన్నాడు. అక్కడికి వెళ్లి చూడగా.. చెట్టుపై గూటిలో ఉన్న ఉడుతను కాకులు పొడవడం గమనించాడు. ఆ కాకుల పైకి రాయి విసిరాడు. కాకులు ఎగిరిపోయాయి. చెట్టు పైనుంచి గాయాలతో ఉన్న ఉడుత పిల్ల కింద పడింది. కళ్లు కూడా తెరవని రోజుల వ్యవధిలో ఉన్న ఉడత పిల్ల గాయాలతో ఉండటం చూడగానే.. అస్లాం గుండె చెరువైంది.

ఉడతను ఎలాగైనా బతికించాలనే తపనతో అస్లాం దాన్ని తన తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చాడు. ఉడత పిల్లను చూసి, బతకదని వాళ్లు చెప్పారు. బాలుడు మరింత బాధ పడ్డాడు. కుమారుడి బాధ చూడలేక ఉడుత పిల్ల గాయాలకు పసుపు రాసి కట్టు కట్టారు. ఆ తర్వాత పాలు పట్టించారు. 20 రోజుల్లో ఆ ఉడుత పిల్ల పూర్తిగా కోలుకుంది. చూస్తుండగానే పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఆ ఇంట్లో తెగ అల్లరి చేస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement