యాదాద్రి, ప్రభన్యూస్ : ధరవత్ శంకర్ నాయక్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం పచ్చర్లబొడ్డు తండాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు దారవత్ శంకర్ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ వరీ ఎస్తే ఉరి అని చెప్పడంతో వరి పంట సాగుచేయలేదని అప్పుల బాధతో శంకర్ నాయక్ మృతిచెందాడన్నారు. నాలుగు బోర్లు వేసి, రూ.9 లక్షలు అప్పు తీర్చ లేక ఇబ్బంది పడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతులపై రాజకీయం చేయడంతో రైతులు అప్పుల బారినపడి మృతి చెందుతున్నట్లు ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ప్రభుత్వం రైతు బీమా నుంచి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..