Friday, November 22, 2024

NLG: పారిశుధ్య కార్మికుల అరెస్టులు హక్కులను కాలరాయడమే..

అనంతగిరి, ఆగస్టు 4 (ప్రభ న్యూస్): పంచాయితీ పారిశుధ్య కార్మికుల అక్రమ అరెస్టులు హక్కులను కాలరాయడమేనని మండల పంచాయతీ యూనియన్‌ నాయకులు సత్యనారాయణ, సురేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద పంచాయితీ పారిశుధ్య కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు సత్యనారాయణ, సురేష్‌ మాట్లాడుతూ… పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటూ పారిశుధ్య కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు.

సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మె నిర్వహిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అయితే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయటం దుర్మార్గమన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆవేదన అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాకాని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement