కోదాడలో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తుల మృతి
కారుతో సహా కొట్టుకు వచ్చిన మృతదేహం
జాతీయ రహదారిపై నిలిచిన వరద నీరు
ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ : ఆల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెను బీభత్సవం సృష్టించింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్త మైంది. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, హుజూర్ నగర్ తదితర పట్టణాలలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా లోని కోదాడ పట్టణంలో నిన్న ఒక్కరోజు రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం, హుజుర్‌నగర్ 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. మాడుగుల పల్లి మండలంలో వరద నీటిలో పంట పొలాలు మునిగిపోయాయి. తోపుచెర్ల గ్రామంలో ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చెరువులు కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. ఏ క్షణనైనా చెరువులకు గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్కూటీపై వెళుతూ….
కోదాడ పట్టణంలోని హుజుర్‌నగర్ రోడ్డుపై స్కూటీపై వెళుతున్న ఎర్రమల్ల వెంకటేశ్వర్లు (54) వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. నిన్నటి నుంచి కురుస్తున్నవర్షాలతో వాగులో ఉప్పొంగాయి. వెంకటేశ్వర్లు స్కూటీపై వెళుతుండగా ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఆయన స్కూటీతోపాటు కొట్టుకుపోయి మృతి చెందారు.
కారుతోపాటు కొట్టుకు వచ్చిన మృతదేహం
కోదాడ పట్టణ సమీపంలోని వాగులో వరద నీటిలో కారుతోపాటు మృతదేహం కొట్టుకువచ్చింది. దీంతో స్థానికులు ఆరా తీయగా కోదాడ పట్టణాని చెందిన రవిగా గుర్తించారు. శనివారం రాత్రి తన కారులో భోజనం కోసం వెళ్లారు. ఇంతటిలో వాగులో నీరు రోడ్డుపైకి వచ్చింది. ఈ వరద నీటిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాడని స్థానికులు తెలిపారు.
జలదిగ్బంధంలో మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లోని షాబునగర్, రాంనగర్, తాళ్లగడ్డ ప్రాంతాల్లోకి వర్షపు నీరు ముంచెత్తింది. దీంతో ఆయా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. చుట్టూ నీరు ముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించారు. ప్రజల వారు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.