Saturday, November 23, 2024

రాత్రికి రాత్రే ప్రభుత్వ భూముల్లో పేదల‌ గుడిసెలు..

నేరేడుచర్ల మే 21 (ప్రభ న్యూస్) : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో శనివారం రాత్రి నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసి అక్రమణలకు పాల్పడ్డారు. సుమారు 200 మంది మహిళలు మూకుమ్మడిగా తరలివచ్చి రాత్రికి రాత్రే గుడిసెలు వేశారు. ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గత 80 రోజులుగా పట్టణ ప్రధాన కూడలి వద్ద నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. పలు ప్రజా సంఘాలు విపక్ష పార్టీల నేతలు వీరి ఆందోళనలకు మద్దతు పలికారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో తహసీల్దారులకు పలుమార్లు వినతిపత్రం కూడా సమర్పించారు. అయినప్పటికీ ప్రభుత్వ నుండి ఎటువంటి స్పందన లభించకపోవడంతో విసుగెత్తిన మహిళలు ఆక్రమణలకు పాల్పడ్డారు.

మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డులో గల సర్వేనెంబర్ 243, 244 లలో 6 ఎకరాల ఒక కుంట ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని ఆక్రమించుకున్నారు. 2018లో కూడా ఇదే భూమిలో ఇదేవిధంగా గుడిసెలు వేయగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ ‌ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి స్థలాన్ని ఖాళీ చేయించి పలువురి పై కేసులు నమోదు చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ రెండు సర్వే నెంబర్ల భూమి విషయం ఎటూ తేలకముందే మరోసారి పేదలు గుడిసెలు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మళ్లీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement