అనంతగిరి, జులై 28(ప్రభ న్యూస్) : పాలేరు వాగు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ గొండ్రియల గ్రామంలోని బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో, ప్రస్తుత పరిస్థితిని శుక్రవారం ఆర్డీఓ పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని తహసీల్దార్ సంతోష్ కిరణ్ ద్వారా తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పాలేరువాగు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గొండ్రియల, కొత్తగూడెం, కిష్టాపురం, చనుపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దయచేసి వాగు పరిసర ప్రాంతాల్లోకి రావొద్దని ఆర్డీఓ సూచించారు. వరద తీవ్రత దృష్ట్యా గొండ్రియల బ్రిడ్జిపై నుండి ఖమ్మం జిల్లాకు రాకపోకలను పూర్తిగా నిలిపి వేసినట్లుగా తెలిపారు. 1988లో పాలేరు వాగు ఇంత ఉదృతంగా ప్రవహించడం చూసామని మరల ఇప్పుడు చూస్తున్నామని పలువురు గ్రామస్తులు ఆర్డీఓ కు తెలియజేశారు. వరద తీవ్రత తగ్గితే ఇబ్బంది ఉండదని, ఏమైనా ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎటువంటి ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు ఆర్డీఓ సూచించారు. ఆయన వెంట ఎమ్మార్వో సంతోష్ కిరణ్, సంబంధిత అధికారులు ఉన్నారు.