Monday, November 25, 2024

సాగ‌ర్ లో ఆఖ‌రి పంచ్ తో అద‌ర‌గొడ‌దాం…

14న నిడ‌మ‌నూరులో కెసిఆర్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌
మూడుమాసాల్లో రెండోసారి
సీఎం సభపై సర్వత్రా ఆసక్తి
సాగర్‌కు బీజేపీ అగ్రనేతలు.. బండిసంజయ్ టూర్‌ ఖరారు
మరోసభపై కాంగ్రెస్‌ గురి
మండుటెండల్లో.. హీటెక్కిన ప్రచారం

నాగార్జున‌సాగ‌ర్: పోలింగ్‌కు ముందు అదరగొట్టేందుకు ప్రధాన రాజకీయపార్టీలు రెడీ అయ్యాయి. నాగార్జునసాగర్‌ నియోజక వర్గంలో సిట్టింగ్‌ను నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌, కంచుకోటను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ శతధా ప్రయత్నిస్తున్నాయి. ఈనెల 14వ తేదీ సాయంత్రం 4గంటలకు నిడమనూరులో జరిగే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానుండగా, మూడుమాసాల్లోనే సాగర్‌కు సీఎం కేసీఆర్‌ వస్తుండడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం సభ టీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు, ప్రజలకు ఉత్సాహాన్నిస్తుందని, 50 వేల మెజారిటీతో నియోజక వర్గంలో గెలుపుజెండా ఎగరేస్తామని నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ విజయం కోసం టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి గెలుపు బాధ్యత అప్పగించగా, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. పార్టీ ప్రధానకార్యదర్శి తక్కళ్ళపల్లి రవీందర్‌రావు ముందునుండీ నియోజకవర్గ ప్రచారాన్ని పర్యవేక్షిస్తు న్నారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌లతో పాటు ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ ఎమ్మె ల్యేలు కూడా నియోజక వర్గంలోనే మకాంవేసి ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి కేసీఆర్‌ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. జానా గతం.. టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు అని ప్రచారం చేస్తున్నారు.
సామాజికవర్గాల సమ్మేళనాలు
ఎన్నికల నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సమ్మేళనాలు జరుగుతున్నాయి. యాదవ, గౌడ, ఆర్యవైశ్య తదితర సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహించగా, పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్‌ చైర్మన్‌లు వీటిని సమన్వయం చేస్తున్నారు. హాలియా, పెద్దవూర, నిడమనూరు ప్రాంతాలపై ప్రధానపార్టీలు ఫోకస్‌ పెట్టాయి. ఇక్కడ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కూడా ఆకర్షిస్తున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో సర్పంచ్‌లపై గురిపెట్టి.. కండువాలు మార్చేస్తున్నారు. పంచాయతీని బట్టి, ఓటర్ల సంఖ్యను బట్టి ప్యాకేజీలు ఇస్తున్నారు.
కాంగ్రెస్‌కు సవాల్‌
కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్‌గా మారింది. జానాకే కాదు.. ఇది రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి కూడా చావోరేవో తేల్చుకోవాల్సిన ఉప ఎన్నికగా నేతలు కష్టపడుతున్నారు. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్‌, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీ లేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా నియమించిన కాంగ్రెస్‌ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నారు.
చివర్లో కమలం పార్టీ అగ్రనేతలు
బీజేపీ అగ్రనేతలు ఇతర రాష్ట్రాల ప్రచారంలో బిజీగా ఉండగా, రాష్ట్ర ముఖ్యులు కూడా సాగర్‌లో ఇంకా అడుగుపెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్స్‌ ఎంపీ అరవింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌లు చివరిలోనే ప్రచారం సాగించనున్నారు. సంజయ్‌ టూర్‌కు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. డాక్టర్‌ రవి నాయక్‌కు టికెట్‌ ఇవ్వగా, పార్టీకి చెందిన అంజయ్యయాదవ్‌ గులాబీగూటికి చేరారు. ప్రస్తుతానికి స్థానిక నేతలతో కలిసి రవికుమార్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్‌ ఆశించిన నివేదితారెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఈ నెల 10వ తేదీ తర్వాత బండి సంజయ్‌ సాగర్‌లో మకాం వేసి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement