మోత్కూర్ ,జూలై 20( ప్రభ న్యూస్) గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మోత్కూర్ -భువనగిరి మెయిన్ రోడ్ ,మున్సిపాలిటీ లోని బీటీ రోడ్డు కాస్త గుంతల మయంగా మారింది.ఈ రోడ్డు వెంట ఇటీవల నిత్యం ఓవర్ లోడ్ ఇసుక లారీల రవాణా కొనసాగగా, గతంలోనే విపరీతమైన గుంతల మయంగా మారిన ఈ రహదారి కాస్త ఇటీవల కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు మరింత గుంతలుగా మారి వాహన చోదకులకు ప్రమాదాలు తప్పడం లేదు .ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు, కార్లు,ఇతర వాహనాలు మోకాళ్ళ లోతు గుంతలలో ప్రయాణికులు, డ్రైవర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. పాఠశాలలకు,కళాశాల లకు వెళ్లే విద్యార్థులు, ఆటో లలో ప్రయాణించే కూలీలకు,వాహన చోదకులకు ప్రమాదాలు చోటుచేసుకుంతున్నాయి .
రాజన్న గూడెం ఊరు సమీపాన ఉన్న బీటీ రోడ్డు సైతం ఇటీవల ఓవర్ లోడ్ ఇసుక లారీల ప్రయాణంతో మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి 7,8 లారీలు సైతం ఆ గుంతల్లో దిగబడి ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది. గుంతల్లో ఆర్ అండ్ బి అధికారులు మట్టి పోసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు బిటి రోడ్డు కాస్త బురదమయంగా మారింది. టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద రోడ్డు గుంతలు చిన్నపాటి కుంటను తలపిస్తున్నాయి. కపురాయిపల్లి నుండి మోత్కూరు వరకు 2021 లో గత రెండేళ్ల క్రితం బీడీ రోడ్డు పునర్నిర్మాణం కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ 10 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం మూడున్నర కిలోమీటర్ల పొడవున రూ. కోట్ల 80 లక్షల నిధులు మంజూరు చేయించగా ఇప్పటివరకు కూడా ఆ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణాణాతీతం .
మోత్కూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సైతం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తక్షణమే బీటీ రోడ్డు నిర్మాణ పనులను టెండర్ పూర్తి చేసి ,పనులు ప్రారంభించాలని సంబంధిత ఆర్ అండ్ బి ఏఈ ని ఆదేశించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని,తర్వాత రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.