Friday, November 22, 2024

వ‌డ్లు కొంటరా.. కొన‌రా… కేంద్రం తేల్చి చెప్పాల‌న్న మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరికి నిరసనగా సూర్యాపేట లో టీఆర్ఎస్, రైతుల మహాధర్నా కార్యక్ర‌మం చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాలో మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… మర్యాదగా వడ్లు కొంటరా ? కొనరా ? కేంద్రం తేల్చి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట శనిలా దాపురించిందన్నారు. ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్నిసాధించుకున్న ధీరత్వం తెలంగాణ ప్రజలదని అన్నారు. ధాన్యం విషయంలో బీజేపీని, కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అడుగడుగునా నిలదీస్తామ‌న్నారు. మోడీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నార‌న్నారు. రైతుల అగ్రహంలో మోడీ సర్కారు మాడి మసై పోతుంద‌న్నారు. యావత్ తెలంగాణ రైతాంగం ఉద్యమ స్పూర్తిని చాటుతూ ఇవాళ‌ ధర్నాలో పాల్గొన్నారన్నారు. కేంద్రం పద్ధతి మార్చుకునేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామ‌న్నారు. టీఆర్ఎస్ అంటేనే రైతు పార్టీ అని.. మాది రైతు ప్రభుత్వమ‌న్నారు. రైతులపై చీమ వాలినా కేసీఆర్ ఊరుకోరు. ఎందాకైనా కొట్లాడుతారు…. కేసీఆర్ పిడికిలి భిగిస్తే కేంద్రం అతలాకుతలమ‌వుతుంద‌న్నారు. ఇక సహించేది లేదన్నారు. మోడీ ప్రభుత్వం ద్వంద నీతిని ఎండ గడుతామ‌న్నారు.
ప్రజలకు వివరిస్తాం..బీజేపీ మోసపూరిత వైఖరితో రైతుల్లో ఆవేదన, ఆందోళన నెలకొంద‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం తేరుకుంటున్నది…ఆర్థికంగా పరిపుష్టం అవుతున్నారన్నారు. ఇంతలోనే కేంద్రం కక్ష్య కట్టి రైతుల నోట్లో మట్టి కొట్టింది…తెలంగాణ రైతులు బాగుపడడం బీజేపీ నాయకులకు ఇష్టం లేదన్నారు. క్షుద్ర రాజకీయాలు చేస్తూ బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారన్నారు. తెలంగాణ బీజేపీ నాయకులకు బాధ్యత లేదు. రైతులంటే ప్రేమ లేదు… బుద్ధి ఉన్న ఏ పార్టీ కూడా రైతులను ఇబ్బంది పెట్టాలని అనుకోదన్నారు. ధాన్యం కొంటామని కేంద్రం నుంచి లెటర్ తెస్తే బీజేపీ నాయకులకు గౌరవం దక్కుతుందని…లేకపోతే గ్రామాల్లో బీజేపీ నాయకులను రైతులే తరిమి కొడతారన్నారు. ఈ ధ‌ర్నాలో పెద్ద ఎత్తున రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement