Friday, November 22, 2024

పేదవాడి కడుపు నిండాలన్నదే కేసీఆర్ లక్ష్యం: మంత్రి జగదీష్

తెలంగాణలో ప్రతి పేదవాడి కడుపు నిండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఓట్ల రాజకీయం కోసమే ప్రతి పథకాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో మరో ఆదర్శ పథకంగా దళిత బంధు నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారoజక పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు భరోసాతో జీవిస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణను చూసి ఇప్పుడు ప్రపంచమే గర్విస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ ను తమ కుటుంబ సభ్యుడిగా తెలంగాణ సమాజం ఆదరిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళల్లో పరుగులు పెడుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను సోమవారం సూర్యాపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు వెనుక ఉన్న పరిస్థితులు సోదాహరణంగా వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అర్హులైన 27 వేల మంది లబ్ధిదారులకు రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. సూర్యపేట జిల్లాలో 9,373 మంజూరు కాగా సూర్యపేట నియోజకవర్గానికి 2,578,తుంగతుర్తి 1542,కోదాడ 2305,హుజుర్నగర్ కు 2939 మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. 2014 కు పూర్వం ఇవే ఆహార భద్రత కార్డుల విషయంతో పాటు అప్పటి పాలకులు చేపట్టిన ప్రతి పధకంలో లోటుపాట్లు ఉండేవని ఆయన చెప్పారు. అటువంటి లోటుపాట్లు కూలంకషంగా పరిశీలించిన మీదటనే కొత్త కార్డుల మంజూరు అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దార్శనికతకు పెట్టింది పేరు చెప్పారు. భారతదేశం గర్వించే పద్దతిలో మిషన్ భగీరథ పథకంతో సురక్షితమైన మంచినీరు ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాయేనని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement