తిమ్మపూర్, ప్రభ న్యూస్ : తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామం వద్ద మిల్లర్ వర్కర్లు స్లాబ్ పోసే మిషన్ ఉదయం 6:30 ప్రాంతంలో 12 మంది బృందంతో నాగసముద్రాలు గ్రామంలో స్లాబ్ పోయడానికి బయలుదేరింది. అయితే గ్రామం దాటి నల్లగొండ పోలంపల్లి మధ్యలో కోళ్ల ఫారాల దగ్గర చేరుకునేసరికి ఎదురుగా లారీ రావడంతో వన్ సైడ్ టైరు దింపడం వల్ల ట్రాక్టర్ పక్కనున్న పొలంలో బోల్తా పడి మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన మహిళ ఉప్పారపు రేణుక (40), ఆమె కు భర్త రాజయ్య, ఇద్దరు కొడుకులున్నారు. రేణుక కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. రోజు కూలీ చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి.
ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణం నల్లగొండ నుండి పోలంపల్లికి గత సంవత్సరం క్రితం రోడ్డు ప్యాచ్ వర్క్ కింద వేయడం జరిగింది. సింగిల్ రోడ్డే కానీ.. ఇరువైపులా మట్టి పోయలేదు. కాంట్రాక్టర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. తారు రోడ్డు పక్కన ఇరువైపులా గుంతలమయమై వరి పొలాలకు వెళ్లే వారు పడిపోయే పరిస్థితులున్నాయి. దానికి తోడు ఇరువైపులా చెట్లు మూలమలుపుల వద్ద దట్టంగా ఉన్నాయి. ఈ కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాణమే పోయింది. కావున కాంట్రాక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించాలని కోరుతున్నారు.