Tuesday, November 19, 2024

నేడు హాలియాలో సీఎం కేసీఆర్ ప్ర‌చార‌‌ సభ

ప్రచారంలో ఎవరి పంథా వారిదే
యువబలగంతో తెరాస ప్రచారం
ఇన్‌చార్జ్‌లుగా ముందస్తు నియామకం
సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌
స్పీడు పెంచిన భాజపా నేతలు
సామాజిక సమీకరణలే కీలకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి గురువారంతో తెరపడు తుండగా, ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ మధ్య నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే.. ఈ ప్రాంతంలో పర్యటించి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఇచ్చిన ఎత్తిపోతల పథకాల హామీలన్నీ నెరవేర్చే కార్యాచరణకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేసిన సీఎం కేసీఆర్‌ బుధవారం మరోసారి హాలియాలో అడుగుపెట్టనున్నారు. జనరల్‌ స్థానంలో బీసీ యువకుడిని నిలిపి టీఆర్‌ఎస్‌ నల్లగొండ రాజకీయాల్లో సరికొత్త సాంప్రదాయానికి, సాహసానికి పూనుకోగా.. టీఆర్‌ ఎస్‌ పార్టీ తరుపున స్థానిక ఇన్‌ఛార్జిలుగా యువ బలగాన్ని మోహరించారు. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు లోకల్‌.. నాన్‌లోకల్‌ నినాదాలు కూడా తెరపైకి రావడంతో ఇవి ఎవరికి మేలు చేస్తాయి.. ఎవరికి నష్టం కలిగిస్తాయన్న లెక్కలను ప్రధానపార్టీల నేతలు వేసుకుంటున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా.. మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీలు స్థానికంగానే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సీఎం ఆదేశాలను క్షేత్రస్థాయికి చేరుస్తూ.. అక్కడి పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. 2018 ఎన్ని కల్లో.. తొలిసారి ఇక్కడ అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా, ఇపుడు మళ్ళీ టీఆర్‌ఎస్‌ దానిని నిలుపుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డి.. ఈ నియోజకవర్గం నుండి ఏడుసార్లు విజయం సాధించగా, ఇపుడు 11వసారి పోటీపడుతున్నారు. స్థానికంగా ఉన్న పట్టు, అవగాహన.. ఈ ప్రాంతంతో ఉన్న అనుభంధం.. అభివృద్ది కార్యక్రమాలు కలిసివస్తాయని కాంగ్రెస్‌ విశ్వసిస్తోంది.
ఎవరిపంథా వారిదే
టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ప్రచారంలో భిన్నపంథాను అవలంభిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎక్కువగా యువ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతల వారసులను రంగంలోకి దింపి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ప్రచారానికి వినియోగిస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలను మోహరించి కేవలం ప్రచారంలోనే వినియోగిస్తూ క్యాడర్‌, ప్రజలతో మాట్లాడేందుకు స్థానిక నేతలనే వినియోగిస్తున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణల కోణంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన నోముల భగత్‌కు టికెట్‌ కేటాయించారు. ఈ నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గ నేతగా జానారెడ్డి ఉన్నారు. ఇదే సామాజిక సమీకరణల కోణంలో బీజేపీ లంబాడ సామాజికవర్గానికి చెందిన రవినాయక్‌కు టికెట్‌ కేటాయించింది. ఆయా సామాజికవర్గాల ఓట్లు.. వీరికి ఏమేరకు గంపగుత్తగా పడుతాయి.. సామాజిక వర్గాల ఓట్లలో చీలికలు ఎవరికి లాభిస్తాయి అన్న అంశాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ నుండి టికెట్‌ చాలామంది ఆశించగా, వీరికి నచ్చజెప్పి వ్యూహాత్మకంగా భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. అభ్యర్ధి ఎంపికలో తడబాటు బీజేపీకి షాక్‌నివ్వగా, పలువురు నేతలు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు.
ఎమ్మెల్సీ ఊపు కొనసాగిస్తామని ధీమా
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ఫుల్‌ ఫామ్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోనూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ జానారెడ్డి లాంటి బలమైన అభ్యర్ధి కాంగ్రెస్‌ నుండి పోటీలో ఉన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ హోరాహోరీ పోరాడుతోంది. కాంగ్రెస్‌ తరుపున పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, సభలు..సమావేశాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు. అటు టీఆర్‌ఎస్‌ నేతలు షెడ్యూల్‌కు ముందునుండే వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ.. అభివృద్దితో ఆకట్టుకునే యత్నాలు చేస్తుండగా, ముందు నుండీ ప్రచారంలో స్తబ్దుగా ఉన్న బీజేపీ నేతలు ఆఖర్లో స్పీడు పెంచారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు ప్రచారభేరి మోగించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement