నేరేడుచర్ల, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్) : సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గల నరసయ్య గూడెంలో తాళం వేసి ఉన్న గృహంలో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన శుక్రవారం వెలుగు చూసిందని నేరేడుచర్ల ఎస్సై పరమేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నరసయ్య గూడెంలో నివాసం ఉంటున్న పెద్ది అప్పిరెడ్డి కనకమ్మలు ఇంటికి తాళం వేసి ఈనెల 23న మున్సిపాలిటీ పరిధిలోని రామగిరిలో ఉంటున్న చిన్న కూతురు ఇంటికి దసరా వేడుకల కోసం వెళ్ళారు.
తిరిగి శుక్రవారం ఉదయం గృహానికి రాగా.. తలుపులకు వేసి ఉన్న తాళాన్ని పగులగొట్టి గుర్తు తెలియని దొంగలు గృహంలోకి చొరబడినట్లు తెలిపారు. గృహంలోని వస్తువులు చిందరవందరగా పడవేసి బీరువాను పగలగొట్టినట్లు గమనించారు. బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు, రూ.20ల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడు అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు గృహానికి వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.