నల్గొండ : తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేదాభిప్రాయాలతో పార్టీ వీడుతున్నారన్నారు. పార్టీలు మారాల్సిన అవసరం నాలాంటి వాళ్లకు లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ… తన కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామన్నారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవన్నారు.
పాము తన పిల్లలను తానే తిన్నట్లు.. తమ పార్టీ వాళ్లే ఇబ్బందులు తెస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయటమే ప్రతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయన్నారు. మేడిగడ్డ విషయంలో అదే జరుగుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలన్నారు. భారాస విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.