Friday, November 22, 2024

గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల వెల్లువ

మోత్కూర్, (ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం కింద నిరుపేదలకు ఖాళీ స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు అందిస్తామని ,దరఖాస్తు చేసుకోవాలని ఈనెల 10 చివరి గడువు అని ప్రకటించడంతో మోత్కూర్ లో ఎక్కడ చూసినా… ఎక్కడ విన్నా… గృహలక్ష్మి పథకం గురించి చర్చ జరగడమే కాకుండా.. ఆధార్ కార్డు ,రేషన్ కార్డు తదితర జిరాక్స్ ప్రతుల కోసం …మీ సేవలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం, తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్కడా చూసిన ప్రజలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు.

వ్యవసాయ కూలీలు, నిరుపేదలు తమ కూలీ పనులు మానుకొని పెద్ద ఎత్తున గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రధానంగా మహిళల పేరు మీద మాత్రమే గృహ లక్ష్మీ పథకం మంజూరు చేస్తామని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడంతో మహిళలు పెద్ద ఎత్తున తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల కు లైన్లు కట్టారు. మున్సిపల్ పరిధితో పాటు ఇతర గ్రామాల నుండి వచ్చే జనం పోతాయిగడ్డ ,పాత బస్టాండ్ మీసేవ తో పాటు అన్ని జిరాక్స్ సెంటర్లలో రద్దీగా కనిపించారు.

తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మద్యం దుకాణాలకు 15 రోజుల గడువు ఇస్తే గృహలక్ష్మి పథకానికి 3 రోజుల గడువు ఇస్తారా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలే నిరుపేదలు, అక్షరజ్ఞానం తెలియని వ్యక్తులు.. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కనీసం వారం తిరగనిదే.. ఈ ధ్రువీకరణ పత్రాలు రావడం లేదు.

- Advertisement -

అలాంటిది ఏకంగా ప్రభుత్వమే 3 రోజులలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం పట్ల ..ప్రజలు, మహిళలు ,యువకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు .తక్షణమే ప్రభుత్వం తొలి విడత గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 31 వరకు గడువును పెంచాలని పలు పార్టీల నాయకులు కోరారు.తొలి రోజు 200 కి పైగా గృహలక్ష్మీ పథకానికి దరఖాస్తు లు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. గత 15 రోజుల క్రితమే పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు లు ఇచ్చామని..మళ్లీ ఇవ్వాల అని పలువురు సందేహపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement