Saturday, November 23, 2024

సా’గ‌రం’

కీలకంగా మారిన కుల సమీకరణలు
అభ్యర్థిపై తేల్చుకోలేని టీఆర్‌ఎస్‌, బీజేపీ
ఎత్తులు పై ఎత్తుల రాజకీయం
క్లియర్‌గా ఉన్న కాంగ్రెస్‌… చావోరేవో
భారీ నామినేషన్లకు సిద్ధమవుతున్న అమరవీరుల కుటుంబాలు, నిర్వాసితులు

నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక కోసం ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతుండగా, రాజకీయపార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైనా ఇటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అటు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించకుండా.. వ్యూహ మథనం చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. దుబ్బాక అనుభవంతో నాగార్జున సాగర్‌పై మూడు ప్రధాన రాజకీయపార్టీలు.. ముందునుండే దృష్టిపెట్టగా, కాంగ్రెస్‌ క్లియర్‌గా బరిలో దిగింది. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌, దుబ్బాక టెంపో కొనసాగించేందుకు బీజేపీ ఎత్తులు.. పై ఎత్తులు వేస్తోంది. షెడ్యూల్‌ విడుదల రోజే.. అభ్యర్ధిని ప్రకటించడం టీఆర్‌ఎస్‌లో ఆనవాయితీగా ఉండగా, నాగార్జునసాగర్‌లో మాత్రం నోటిఫికేషన్‌ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా జరుగుతున్నా.. అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంతో.. అందరి దృష్టీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఉంది. సీఎం వ్యూహం విపక్షాలను కూడా కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. ఈ నియోజకవర్గంలో కులసమీకరణాలు కూడా కీలకమయ్యే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా.. వ్యవహరిస్తున్నారు. గ్రౌండ్‌లో బలగాలను మోహరించి.. విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నా.. అభ్యర్ధిత్వం ఖరారుపై మాత్రం తొందరపడడం లేదు. బీజేపీ స్థానికంగా పెద్దగా బలం లేకున్నా.. నాగార్జునసాగర్‌లో సంచలన విజయం సాధిస్తామని ముందునుండీ చెబుతోంది. దీనికి సంబంధించిన వ్యూహం అంతుచిక్కకుండా ఉంది. అభ్యర్ధిపై బీజేపీ నేతలు కూడా అనేకసార్లు.. కసరత్తులు చేశారు. ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక్కడ రెడ్డి, యాదవ, గిరిజన ఓట్లు కీలకంగా ఉన్నాయి. ప్రతి సామాజిక వర్గంలోనూ ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. దీంతో అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజేపీ వేస్తున్న ఎత్తులు, తెరవెనుక రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది.
భారీ నామినేషన్లు తప్పవా?
ఇందూరు పసుపురైతులు భారీ నామినేషన్లు వేసిన తరహాలో.. నాగార్జునసాగర్‌లో మరో వ్యూహానికి విపక్షాలు రెడీ అయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల నుండి 400 నామినేషన్లు వేయించబోతున్నట్లు.. ఆ సంఘం నేతలు చెబుతున్నారు. ఇక భూ నిర్వాసిత కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ నామినేషన్ల వ్యూహం అధికార పార్టీకి సమస్యలు సృష్టించే అవకాశం ఉందా.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మండలి ఎన్నికల ఉత్సాహంతో.. ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రతి అడుగునూ ఆచితూచి వేయాలనుకుంటోంది.
కోలాహలం మొదలు
నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక జరుగుతోంది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నిడమనూరులోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని రిటర్నింగ్‌ అధికారి కేంద్రంగా మార్చారు. తొలిరోజు నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్ల ప్రక్రియ షురూ కాగా, ఐదుగురు స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌ సింగ్‌ సాగర్‌ ఉప ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల కోలాహలం నెలకొనగా, ఇపుడు సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మరో నెలరోజుల పాటు హడావుడి నెలకొననుంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement