సూర్యాపేట, ప్రభ న్యూస్: దొంగలు పలు రకాలు… దొంగతనాలు అంతకంటే ఎక్కువ. దొంగలు కూడా ..ఎక్కడ, ఎప్పుడు, ఏది, ఎలా దొంగిలించాలో.. ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా సూర్యాపేట జిల్లా కేంద్రం పరిసరాల్లో ఓ డీజిల్ ఆయిల్‌చోరీ కొద్దిసేపటి క్రితం వెలుగుచూసింది. వినూత్న రీతిలో డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న దొంగలను పోలీసులు శుక్రవారం అదుపులో తీసుకున్నట్లు- సమాచారం ? రోడ్ల వెంట నిలిపి ఉన్న లారీల నుంచి ఈ చోరీ జరుగుతోంది. సంబంధిత లారీల డ్రైవర్లకు ఈ విషయం తెలుసా ? లేదా ? అనేది పక్కన పెడితే డీజిల్ చోరీ మాత్రం జరుగుతోంది. ఇదెలా అంటే… లారీ డ్రైవర్లు… భోజనాలకో… కొంత సేపు విశ్రాంతి కోసమే… లేదా టిఫిన్‌చేసేందుకో.. లారీలు రోడ్ల పక్కనే ఆపుతుండటం సహజం.
అలాంటి వాహనాల పక్కన ఓ లారీలో డీజిల్‌నింపుకునేందుకు ట్యాంకర్లు… పక్కనే ఉండే లారీ లేదా ఇతర వాహనం నుంచి ఆయిల్‌ను తేలిగ్గా… త్వరగా కొట్టేసేందుకు అవసరమైన మోటార్‌ను బిగించుకున్న లారీని పక్కన ఆపి ఇతర పెద్ద వాహనాల నుండి చాకచక్యంగా డీజిల్‌ను చోరీ చేసేస్తున్నారు. సూర్యాపేట శివారులో కొంత కాలంగా ఇలాంటి చోరీలు అధికమయ్యాయి. తాజాగా సూర్యాపేట పట్టణంలో ఇలా డీజిల్ దొంగతనం చేస్తుండగా వాహన దారులు పట్టుకొని శుక్రవారం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఇటువంటి చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం.